స్నానం చేస్తున్నప్పుడు నీళ్లు ఎంతగా వేస్ట్ అవుతాయో మీకు తెలిసిందే. కానీ, వాటిని సేవ్ చేసే మార్గాలేవీ మనకు తెలియదు. వీలైనంత వరకు నీటిని వేస్ట్ చేయకుండా నీటిని పొదుపు చేయడం ఒక్కటే మార్గం. ఇదంతా పక్కన పెడితే.. మీరు ఎప్పుడైనా ఎవరైనా స్నానం చేసిన నీటితో స్నానం చేశారా? ఛీ.. యాక్.. అదేం ప్రశ్న.. అలా ఎవరైనా చేస్తారా అనేగా మీరు అనుకొనేది. అయితే, మీరు ఓ అమ్మాయి గురించి తెలుసుకోవల్సిందే.
మనం స్నానం చేసే నీరు నేరుగా మురుగు కాలువలోకే వెళ్తుందనే సంగతి మీకు తెలిసిందే. అయితే, ఆ యువతి మాత్రం నీటిని వేస్ట్ చేయకుండా బాటిళ్లలో పడుతోంది. వాటిని ఆన్‌లైన్‌లో పెట్టి తన ఫాలోవర్లకు విక్రయిస్తోంది. ఇది వినేందుకు కొంచెం చిత్రంగానే ఉన్నా నిజం. ఏంటా పాడు పనులని ఎవరైనా అడిగితే.. ఇది నా యాపారం.. అంటోంది.
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ బెల్లె డెల్ఫినే అనే యువతికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. బ్రిటన్‌కు చెందిన ఈ పోరి అందానికి అందం.. తెలివి తెలివి అన్నీ ఉన్నాయ్. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు ఆమెకు ఓ క్రేజీ ఐడియా వచ్చింది. ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్, వీడియోస్ ఏం పోస్ట్ చేద్దాం అనుకుందో ఏమో.. తాను స్నానం చేసిన నీటిని అమ్మితే ఎలా ఉంటుందో అనే ఐడియా వచ్చింది. సరదాగా.. ఆమె తన ఇన్‌స్టాలో ‘గేమర్ గర్ల్ బాత్ వాటర్’ పేరుతో వ్యాపారం మొదలుపెట్టింది. బాత్ వాటర్‌ను బుల్లి బాటిళ్లలో నింపి.. అమ్మకానికి పెట్టింది.
అదేం పిచ్చో ఏమిటో.. ఆమె స్నానం నీటిని కొనుగోలు చేసేందుకు ఫాలోవర్లు ఎగబడ్డారు. వామ్మో.. మరొకరు స్నానం చేసిన నీటిని వాడటం ఏమిటీ? వ్యాధులు రావా అనేగా మీ సందేహం? వస్తాయండి.. ఎందుకు రావు. కానీ, పిచ్చి అభిమానులు అవేమీ పట్టించుకోరు కదా. ఆమె చెమట వాసన కూడా మాకు పెర్‌ఫ్యూమే అంటూ వాటిని కొనడం మొదలుపెట్టారు. అలా ఆమె వేలాది బాటిళ్లను అమ్మేసింది. లెక్కలేనన్ని ఆర్డర్లు రావడంతో ఆమె రోజంతా స్నానం చేస్తూనే ఉండేదట.
ఆమె ఒక్కో బాటిల్‌ను సుమారు రూ.2 వేలకు విక్రయించింది. గట్టిగానే సంపాదించింది. అయితే, మరీ స్నానం నీళ్లంటే రొచ్చు కంపు కొడతాయి కదా. అందుకే, ఆమె వాటిలో కొన్ని రకాల ఫ్లూయిడ్స్ కలుపేది. దానివల్ల ఆ స్నానం నీరు సువాసనలు వెదజల్లేది. తన శరీర వాసనలు కూడా అందులో కలిసి.. అవి మరింతగా మత్తెక్కించేవట. అయితే, ఈ వ్యాపారం ఆమె సీరియస్‌గా మొదలుపెట్టింది అనుకుంటే పొరపాటే. సరదాగానే స్టార్ట్ చేసింది. కానీ, జనాలు సీరియస్‌గా తీసుకుని ఆర్డర్లు పెట్టడం మొదలుపెట్టారు. అది ఆమెకు లాభాలు తెచ్చిపెట్టింది.
ఈ క్రేజీ బిజినెస్ గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సరదాగా ప్రారంభించిన ఈ వ్యాపారానికి అంత డిమాండ్ వస్తుందని ఊహించుకోలేదు. వచ్చిన ఆర్డర్ల కోసం స్నానం చేసి చేసి అలసిపోయా మధ్యలో విరామం కూడా తీసుకున్నా. ఆ బాటిళ్లను కొందరు తమ స్నేహితులకు బహుమతిగా ఇస్తున్నామని చెప్పేవారు. కొందరైతే నేను స్నానం చేసిన నీటిలో ఉమ్మి వేయాలని కోరేవారు. కొందరైతే దారుణంగా నా మూత్రం కూడా అడిగేవారు’’ అని తెలిపింది. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌ను ఈ వ్యాపారానికి వాడేసుకుంటుందని కాబోలు.. చివరికి ఆమె అకౌంట్‌ను మెటా బ్యాన్ చేసింది. అయినా.. పిచ్చి పలు విధాలంటే ఇదే కాబోలు.