బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్లకు చాలా రూల్స్ ఉంటాయి. అయితే వాటిని అర్థం చేసుకోవడం చాలా గందరగోళంగా ఉంటుంది. ముఖ్యంగా పాన్ కార్డ్ గురించి. చాలా మంది ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం పాన్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే, అనేక బ్యాంకింగ్ లావాదేవీలకు సైతం పాన్ చాలా ముఖ్యమనే సంగతి కొందరికి తెలీదు. ముఖ్యంగా క్యాష్ డిపాజిట్స్ సమయంలో పాన్ కార్డు తప్పకుండా అవసరమా? అసలు బ్యాకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి? తదితర విషయాలు మీ కోసం.
పాన్ కార్డ్ అంటే? అది దేనికి ఉపయోగం?
పాన్ కార్డ్ అనేది ఇండియన్ ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. ఇది వ్యక్తులు, సంస్థలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా పనిచేస్తుంది. అలాగే ఆదాయపు పన్ను ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుంది. పన్ను సంబంధిత కార్యకలాపాలతో పాటు, పెట్టుబడులు, ఆస్తి కొనుగోళ్లు, నగదు డిపాజిట్లు వంటి అనేక ఇతర ఆర్థిక లావాదేవీలకు కూడా పాన్ కార్డ్ అవసరం అవుతుంది.
ప్రతి క్యాష్ డిపాజిట్‌కు పాన్ కార్డు అవసరమా?
చాలామంది ప్రతి నగదు డిపాజిట్‌కు పాన్ కార్డు అవసరం అని భావిస్తారు. కానీ, అందులో నిజం లేదు. కేవలం కొన్నింటికి మాత్రమే అవసరం. అవేంటో చూడండి.
⦿ ఒక రోజులో రూ. 50,000 దాటిన డిపాజిట్లు చేస్తున్నప్పుడు మాత్రమే పాన్ కార్డు అవసరం అవుతుంది. పెద్ద నగదు లావాదేవీలను పర్యవేక్షించడానికి, ఆర్థిక నిబంధనలను సరిగ్గా పాటిస్తున్నారా లేదా అని తెలుసుకోడానికి మాత్రమే పాన్ ఉపయోగపడుతుంది.
⦿ అలాగే ఒక్క ఆర్థిక సంవత్సరంలో మీ ఆర్థిక లావాదేవీలు రూ. 20 లక్షలు మించినా సరే.. పాన్ అవసరం పడుతుంది. ముఖ్యంగా మీ పాన్‌తో లింకు ఉన్న అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల ఖాతాల్లో మీ మొత్తం నగదు డిపాజిట్లు రూ. 20 లక్షలు దాటితే మీ పాన్ కార్డు వివరాలను బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. అల్రెడీ మీ పాన్ కార్డు బ్యాంకులతో అనుసంధానమై ఉంటే.. మీకు సమాచారం అందుతుంది. లేదా ప్రత్యేకంగా సమర్పించాల్సి ఉంటుంది.
2022లో CBDT రూపొందించిన నియమాల ప్రకారం.. పాన్ నిబంధనలు ఇలా ఉన్నాయి:
2022లో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) భారీ డిపాజిట్లు ఇతరాత్ర లావాదేవీలకు సంబంధించిన అంశాలపై కొత్త నిబంధనలను రూపొందించింది. ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్స్ లేదా విత్ డ్రాలు చేసే వ్యక్తులు, వ్యాపార సంస్థలు తప్పనిసరిగా వారి పాన్ లేదా ఆధార్‌ను కోట్ చేయాలని ఈ సవరణల్లో పేర్కొన్నారు. ఈ నియమాలు సేవింగ్స్, కరెంట్ అకౌంట్, పోస్ట్ ఆఫీస్ ఖాతాలతో సహా అన్ని రకాల ఖాతాలకు వర్తిస్తాయి. పెద్ద లావాదేవీల ట్రాకింగ్ కోసం, చట్టవిరుద్ధమైన ఆర్థిక కార్యకలాపాలను అరికట్టాలనే లక్ష్యంతో సీబీడీటీ ఈ నిబంధనలు రూపొందించింది.
PAN కార్డ్ లేకపోతే ఏమవుతుంది?
పాన్ కార్డు లేకపోతే క్యాష్ డిపాజిట్స్ జరగవేమో అనే భయం మీలో ఉందా? దాని గురించి మీరు పెద్దగా ఆలోచించక్కర్లేదు. పాన్ లేకపోయినా మీరు అకౌంట్లో డబ్బులు జమా చేయొచ్చు. కానీ, అది చాలా ఆలస్యం కావచ్చు. లేదా కొన్ని బ్యాంకులు ఇందుకు సిద్ధం కాకపోవచ్చు. కాబట్టి, అలాంటి అంతరాయాలను అదిగమించడానికి మీరు పాన్ కార్డుకు ధరకాస్తు చేయడమే ఉత్తమం. ఒక వేళ ఆ సమయానికి మీ దగ్గర పాన్ కార్డు లేకపోయినా.. మీ ఆధార్ కార్డు నెంబర్తోనైనా క్యాష్ డిపాజిట్ చేయొచ్చని నిబంధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా మీ క్యాష్ డిపాజిట్ రూ.20 లక్షలు దాటితేనే ఈ సమస్యలు. అంతకంటే తక్కువ ఉంటే పెద్దగా సమస్యలేవీ ఉండవు.
ఇవి గుర్తుంచుకోండి:
⦿ మనీ లాండరింగ్ వంటి అసాంఘిక పనుల నివారణ కోసమే పాన్‌ను తప్పనిసరి చేశారు.
⦿ పన్నుల ఎగవేసేవారిపై నిఘా ఉంచడానికి కూడా ఈ పాన్ కార్డు ఉపయోగపడుతుంది.
⦿ ఒక్క రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేస్తే పాన్ అవసరం.
⦿ రూ.20 లక్షల కంటే ఎక్కువ వార్షిక డిపాజిట్లు చేస్తున్నట్లయితే.. మీ పాన్ లేదా ఆధార్ వివరాలు ఇవ్వాలి.
⦿ మీకు PAN లేకపోతే, పెద్ద లావాదేవీ చేయడానికి కనీసం 7 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి.