Best Korean Movies: జీవితంలో ఒక్కసారైనా ఈ కొరియన్ హర్రర్ మూవీస్ చూడాల్సిందే, తర్వాత మీరే మాకు థాంక్స్ చెబుతారు!

Image Credit: The Wailing Movie/Amazon Prime Video

కొరియన్ వెబ్ సీరిస్, డ్రామాలకు ఎంత క్రేజ్ ఉందో మీకు తెలిసిందే. కేవలం డ్రామాలు మాత్రమే కాదు.. ఈ హర్రర్ మూవీస్ కూడా భలే క్రేజీగా ఉంటాయి. ఒక్కసారి చూడటం మొదలుపెట్టారంటే.. మళ్లీ మళ్లీ కొరియన్ హర్రర్ మూవీస్ కోసం వెతుకుతూనే ఉంటారు. అందుకే మీకు ఆ శ్రమ లేకుండా మేమే ఇక్కడ కొన్ని బెస్ట్ కొరియన్ హర్రర్ మూవీస్‌ను ఇక్కడ అందిస్తున్నాం. వీటిని చూసిన తర్వాత మీరే మాకు థాంక్స్ చెబుతారు. ఇంకెందుకు ఆలస్యం.. అవేంటో చూసేయండి.

Train to Busan (2016)

మీకు జోంబీస్ అంటే ఇష్టమా? అయితే తప్పకుండా మీరు ‘ట్రైన్ టు బుసాన్’ చూడాల్సిందే. 2016 ఈ మూవీకి భలే క్రేజీ రెస్పాన్స్ ఉంది. యెయోన్ సాంగ్-హో దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొత్తం రైలులోనే ఉంటుంది. చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. జోంబీలు ఉన్న రైలులో ప్రయాణిస్తున్న ఓ తండ్రి తన కూతురిని చివరి వరకు వాటి నుంచి ఎలా రక్షించుకుంటాడు. చివరికి ఏమవుతుంది అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ Amazon Prime Video, JIO cinema OTTల్లో స్ట్రీమ్ అవుతోంది.

Save the Green Planet (2003)

జాంగ్ జూన్-హ్వాన్ దర్శకత్వం వహించిన మూవీ భయపెట్టడమే కాదు.. కడుపుబ్బా నవ్విస్తుంది కూడా. గ్రహాంతరవాసులు భూమిని నాశనం చేయడానికి కుట్ర పన్నారని భావించే వ్యక్తి.. వాటిని ఎదుర్కొడానికి ఏం చేశాడు. చివరికి ఏమైందనేది ఆసక్తికరంగా సాగుతుంది. అయితే, సబ్ టైటిల్స్‌తో చూసుకోవాలి. ఈ మూవీని Amazon Prime Video OTTలో చూడవచ్చు.

The Host (2006)

‘ది హోస్ట్’ మూవీకి కూడా బాంగ్ జూన్-హో దర్శకత్వం వహించాడు. ఇది కూడా కామెడీ హర్రర్ మూవీ. హాన్ నదిలో అమెరికన్ సైనిక సిబ్బంది రసాయనాలను డంప్ చేస్తారు. దాని నుంచి ఓ వింత జీవి బయటకు వస్తుంది. ఆ తర్వాత అది చేసే హంగామా అంతా ఇంతా కాదు. బోలెడన్ని నవ్వులు.. భయపెట్టే సీన్లతో ఈ మూవీ సాగుతుంది. Netflix ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

A Tale of Two Sisters (2003)

కొన్ని సినిమాలు.. చూసిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వాటిలో కూడా ఇది కూడా ఒకటి. ‘ఎ టేల్ ఆఫ్ టు సిస్టర్స్’ కళ్లలో నిలిచిపోయే భయానక చిత్రం. అసలు అక్క చెల్లెల్లు ఎవరు? వారిని వెంటాడుతున్న చీకటి రహస్యం ఏమిటనేది భలే ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ఈ మూవీని Amazon Prime Video OTTలో చూడవచ్చు.

Three… Extremes (2005)

‘త్రి ఎక్స్‌ట్రీమ్స్’.. టైటిల్‌కు తగినట్లే ఇందులో మూడు కథలు ఉంటాయి. ఈ మూడింటికి ఫ్రూట్ చాన్, తకాషి మైకే, పార్క్ చాన్-వూక్ దర్శకత్వం వహించారు. మూడు కథలు చాలా భిన్నంగా ఉంటాయి. కొత్తగానే కాదు.. చాలా క్రూరంగా ఉంటాయి. ధైర్యం ఉంటేనే చూడండి. ఈ మూవీని Amazon Prime Video OTTలో చూడవచ్చు.

The Quiet Family (1998)

కిమ్ జీ-వూన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మొత్తం ఒక గ్రామంలో ఉన్న లాడ్జిలో సాగుతుంది. ఈ లాడ్జిలో బస చేసే సందర్శకులు ఒకరి తర్వాత ఒకరు అనుమానస్పందంగా చనిపోతూ ఉంటారు. అందుకు కారణం ఏమిటీ? ఎవరు ఆ హత్యలు చేస్తున్నారు అనేది ఉత్కంఠభరితంగా చూపించారు. కొన్ని సీన్స్ నవ్వులు పూయిస్తాయి. ఈ మూవీని Amazon Prime Video OTTలో చూడవచ్చు.

The Closet (2020)

కిమ్ క్వాంగ్-బిన్ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ డ్రామ కూడా మీకు బాగా నచ్చేస్తుంది. పిల్లలకు దూరంగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉండే తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే చిత్రం ఇది. ఇందులో ఓ యువతి తనకు తెలియకుండా ఆత్మల ప్రపంచానికి వెళ్లిపోతుంది. తన తండ్రి ఆమె కోసం అన్వేషిస్తాడు. చివరికి ఆమె ఎలాంటి పరిస్థితుల్లో దొరికంది? ఆమెను రక్షించగలిగాడా లేదా అనేది మీరు బుల్లితెరపై చూడాల్సిందే. ఈ మూవీని Amazon Prime Video OTTలో చూడవచ్చు.

Monstrum (2018)

16వ శతాబ్దానికి బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ సినిమా కూడా భలే బాగుంటుంది. కంటికి కనిపించని ఓ రాక్షసుడిని వెతికే రాజు, అతడి సైన్యం చుట్టూ కథ సాగుతుంది. పొలిటికల్.. హర్రర్‌ను మేళవించిన చిత్రం ఇది. కాస్త కొత్తగానే ఉంటుంది. ఈ మూవీని Amazon Prime Video OTTలో చూడవచ్చు.

The Wailing (2016)

నా హాంగ్-జిన్ దర్శకత్వం వహించిన ఈ అట్మాస్ఫియరిక్ మిస్టరీ థ్రిల్లర్ చివరి వరకు కట్టి పడేస్తుంది. ఓ అపరిచితుడి రాకతో క్రూరమైన హత్యల పరంపర మొదలవుతుంది. ఇందులో ట్విస్టులు ఉంటాయి బాసూ.. మీరే నమ్మలేరు. తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. ఈ మూవీ Amazon Prime Video OTTలో స్ట్రీమింగ్ అవుతోంది.

The Mimic (2017)

కొడుకుని కోల్పోయిన ఓ జంట మౌంట్ జాంగ్ సమీపంలో నివసించే ఓ చిన్నారిని దత్తత తీసుకుంటారు. అయితే అప్పటికే ఆమెలో ఓ పురాతన ఆత్మ ఉంటుంది. ఆ పిల్లకు బయటకు అమాయకంగా కనిపించినా చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటుంది. చివరికి ఆమె నుంచి ఆత్మను బయటకు తరిమారా? ఆమెను దత్తత తీసుకున్న ఆ జంటకు ఏమైందనేది సినిమాలోనే చూడాలి. ఈ మూవీ Amazon Prime Video OTTలో స్ట్రీమింగ్ అవుతోంది.

తరవాత కథనం