Gukesh Dommaraju: ప్రపంచ చెస్ సామ్రాజ్యాన్ని 18 ఏళ్ల కుర్రాడు దమ్మరాజు గుకేశ్ కైవశం చేసుకున్నాడు. 32 ఏళ్ల డిఫెండింగ్ ఛాంపియన్ చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌ను ఓడించాడు. నయా ఛాంపియన్‌గా అవతరించాడు. ఇప్పటి వరకు జరిగిన ఛాంపియన్‌షిప్‌లు ఒక ఎత్తు ఇప్పుడు గుకేష్ గెలుచుకుంది ఒక ఎత్తు.
చివరి వరకు హోరా హోరీ పోరు
నువ్వా నేనా అన్న సాగిన పోరులో చెస్ ప్రపంచానికి కొత్త రారాజు పరిచయం అయ్యాడు. భారతదేశానికి చెందిన దొమ్మరాజు గుకేశ్ 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను 14వ రౌండ్‌లో కైవశం చేసుకున్నాడు. సింగపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో గెలుపొందడం ద్వారా గుకేష్ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. అతను 1985లో 22 సంవత్సరాల 6 నెలల వయస్సులో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గ్యారీ కాస్పరోవ్ రికార్డును బద్దలు కొట్టాడు.
స్లోగా స్టార్ట్ చేసి ఛాంపియన్ అయిన గుకేశ్
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ప్రతికూలంగా ఉన్నా పట్టువదలకుండా విజయాన్ని ముద్దాడాడు. మొదటి రౌండ్‌లో వెనుకబడి ఉన్నప్పటికీ మూడో రౌండ్ నుంచి అద్భుతంగా రీబౌన్స్ అయ్యాడు. 18 ఏళ్ల భారత స్టార్ 11వ రౌండ్‌లో ఆధిక్యం సాధించాడు. అయినా ప్రత్యర్థి డింగ్ లిరెన్ వెనక్కి తగ్గడానికి ఇష్టపడలేదు. చివరికి ఆఖరి రౌండ్‌లో గుకేశ్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నాడు.
భావోద్వేగానికి గురైన గుకేశ్
బుధవారమే ఫలితం తేలాల్సి ఉన్నప్పటికీ 5 గంటలపాటు సాగిన 13వ రౌండ్‌లో పాయింట్లు పంచుకున్నారు. విజయం కోసం ఇరువురు గట్టిగానే పోరాడారు. చివరకు 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్ క్లోజ్ చేశారు. దీంతో మరోసారి మ్యాచ్ డ్రా అయింది. అందుకే గురువారం 14వ రౌండ్ జరిగింది. ఇందులో గుకేశ్ 7.5తో విజేతగా నిలిచాడు. మొత్తం 14 గేమ్‌లు జరిగితే…గుకేశ్- 3, లిరెన్- 2 గేమ్‌ల్లో గెలుపొందారు. తొమ్మిది డ్రా అయ్యాయి. ప్రపంచ ఛాంపియన్ అయిన తర్వాత గుకేష్ తన భావోద్వేగాలను అదుపు చేయలేకపోయాడు.
గుకేశ్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ గుకేష్‌కు అభినందన సందేశం పంపారు. “చారిత్రక, ఆదర్శప్రాయమైనది. ఈ అద్భుతమైన విజయానికి డి. గుకేష్‌కు చాలా అభినందనలు. ఇది ప్రతిభ, కృషి, నిబద్ధత ఫలితం. చరిత్రలో తన పేరును నమోదు చేసుకున్నాడు, రాబోయే టోర్నమెంట్‌ల కోసం శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు.
డి గుకేశ్ 29 మే 2006న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి పేరు రజనీకాంత్, ఈఎన్టీ స్పెషలిస్ట్. తల్లి పద్మ కూడా డాక్టర్. తెలుగు వారైన ఈ ఫ్యామిలీ చాలా ఏళ్ల క్రితం చెన్నైలో సెటిల్ అయ్యారు. మొదట్లో వారానికి మూడు రోజులు చెస్‌కు ఒక్కో గంట కేటాయిస్తూ ఉండేవాడు. వారాంతాల్లో చెస్ టోర్నమెంట్‌ల్లో పాల్గొనేవాడు.
9 ఏళ్ల వయసులో తొలి ఛాంపియన్‌షిప్
2015లో కేవలం 9 ఏళ్ల వయస్సులో అండర్-9 ఆసియన్ స్కూల్ చెస్ ఛాంపియన్‌షిప్ తొలిసారి గెలుచుకున్నాడు. అలా మొదలైన జైత్రయాత్ర ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మార్చి 2017లో అంతర్జాతీయ మాస్టర్ టోర్నమెంట్ గెలుచుకొని మూడో అతి పిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. 12 ఏళ్ల వయస్సులో 2018 ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా 5 బంగారు పతకాలు సాధించాడు.
ఆనంద్ తర్వాత గుకేశ్
2023 సంవత్సరంలో భారతదేశపు టాప్ ర్యాంక్ చెస్ ప్లేయర్ అయ్యాడు. ఆనంద్ 37 ఏళ్ల పాటు భారత టాప్ ర్యాంక్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అతన్ని వెనక్కి నెట్టి టాప్ ప్లేయర్ అయ్యాడు. ఇప్పుడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన రెండవ భారతీయుడుగా నిలిచాడు.
ఐదు సార్లు విశ్వవిజేత అయిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ సొంతం చేసుకున్న రెండో ఇండియన్‌గా గుకేశ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. 2012 తర్వాత మళ్లీ ఈ ఆటలో ప్రపంచ ఛాంపియన్‌గా భారతీయుడు అయ్యాడు.