జనసేనపై కాపు బాంబు – జగన్ మాస్టర్ ప్లాన్

జనసేనపై కాపు బాంబు - జగన్ మాస్టర్ ప్లాన్

Kapu Leaders: రాజకీయాలు అంటే పార్టీని బలోపేతం చేసుకోవడమే కాదు.. అప్పుడప్పుడు బలహీనం కూడా చేసుకోవాలి. ఆ బలహీనతను ఇతర పార్టీల బలంగా మార్చి సరైన సమయం చూసి ఆ బలాన్నంతా లాగేసుకోవాలి. ఇలాంటి ప్లాన్లు అమలు చేయాలంటే జగన్ రెడ్డి లాంటి రాజకీయ నేతకు చాలా ఈజీనే. తండ్రి చనిపోయిన మరుసటి రోజు నుంచే ఆయన పార్టీ పెట్టే అవసరం పడుతుందని చనిపోయిన వారందర్నీ తండ్రి ఖాతాలో వేసేసుకుని ఓదార్పుయాత్రకు ఎలా బాటలు వేసుకున్నారో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే జగన్ అలాంటి ప్లాన్లు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. పార్టీని బలహీనం చేసుకుంటే జగన్ ఎలా బలపడతారు ? అదే అసలు లాజిక్ !

జగన్‌కు అధికారం దూరం చేసింది కాపులు – పవన్ !

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గతంలోనూ ఉంది. ఒంటరిగా పోటీ చేసింది. కానీ ఈ సారి టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసింది. రాజకీయాల్లో లెక్కలు చాలా తేడాగా ఉంటాయి. రెండు ప్లస్ రెండు నాలుగు మాథ్స్, కానీ పొలిటికల్ మాథ్స్‌లో మాత్రం రెండు ప్లస్ రెండు ఇరవై కావొచ్చు.. జీరో కావొచ్చు. ఇటివల మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ ఆఘాడి జీరో అయింది. కానీ ఏపీలో మాత్రం ఇరవై అయింది. కూటమికి ఓట్లు అలా కలసి రావడం వల్ల అయింది. పవన్ కల్యాణ్ కు ఉన్న ఆరేడు శాతం ఓట్లు మొత్తం మార్చేశాయి. సిక్కోలు నుంచి నెల్లూరు వరకు వచ్చిన ఫలితాలు, మెజార్టీలు చూస్తే ఇక వైసీపీ పార్టీని క్లోజ్ చేసుకోడం మంచిదని ఎవరికయినా అనిపిస్తుంది. కానీ జగన్ అక్కడే ప్లాన్ బీ అమలు చేయడం ప్రారంభించారు.

జనసేనను మరింత బలోపేతం చేస్తున్న జగన్

జనసేన పార్టీని జగన్ ఇప్పుడు బలోపేతం చేస్తున్నారు. అందులో సందేహమే లేదు. ముఖ్యంగా కాపు నేతలందర్నీ జనసేనలోకి పంపుతారు. జగ్గయ్యపేట ఉదయభాను దగ్గర నుంచి అవంతి శ్రీనివాస్ వరకు ఎంతో మంది జనసేన బాట పడుతున్నారు. చివరికి అంబటి రాంబాబు కూడా అదే పని చేసినా ఆశ్చర్యం లేదు. ఓ మిషన్ ప్రకారం నేతలంతా జనసేనలో చేరుతారు. ఆ పార్టీని బలోపేతం చేస్తారు. మరి జగన్ కు లాభం ఏమిటి ?

బలం పెరిగింది కాబట్టి సీట్లు పెంచాలంటారు..కానీ టీడీపీ అంగీకరించదు !

జగన్ మిషన్ ఏమిటి.. టీడీపీ, జనసేనను దూరం చేయడం, అలా చేస్తేనే అధికారం మళ్లీ అందుకోవడానికి పోరాడవచ్చు. జనసేనతో పొత్తు అనేది జగన్ అజెండాలో లేదు. టీడీపీని జనసేనకు దూరం చేయాలంటే.. ఒక్కటే మార్గం. అది జనసేన పార్టీని బలోపేతం చేసి.. తాము టీడీపీ కన్నా బలంగా ఉన్నామనే భావనకు తెచ్చేలా చేసి.. తప్పని సరిగా విడిపోయి ఒంటరిగా పోటీ చేసేలా చేయడం. ఇంత మంది కాపు నేతలు జనసేన పార్టీలో చేరారని వారికి టీడీపీ సీట్లు పెంచే అవకాశం లేదు. అలా పెంచితే ఆ పార్టీ ఉనికి ప్రమాదం . అలాంటప్పుడు తప్పని సరిగా ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తుంది.

మిషన్ పూర్తి చేసి మళ్లీ వైసీపీలోకి నేతలు

ఇలా మొత్తం పూర్తి చేసుకుని మళ్లీ ఎన్నికల నాటికి ఈ జనసేన నేతలంతా వైసీపీ గూటికి చేరుకుంటారు. అప్పుడు మళ్లీ త్రిముఖ పోటీ జరుగుతుంది. ఈ రాజకీయ చూస్తే కృష్ణ సినిమాలో వేణుమాధవ్ తో ఇళ్లు ఖాళీ చేయించడానికి రవితేజ అండ్ గ్యాంగ్ చేసిన ప్లాన్ గుర్తుకు వస్తుంది. అచ్చంగా అదే ఇప్పుడు జగన్ అమలు చేస్తున్నారు. మరి పవన్ కూడా వేణుమాధవ్ లా ట్రాప్ లో పడిపోతారా.. తెలుసుకుంటారా ?

తరవాత కథనం