వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటీ? జమిలీ ఎన్నికలతో దేశానికి ఏం ప్రయోజనం? ఇప్పటి వరకు ఏ దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది?

What is One nation One Election

ఒక దేశం ఒకే ఎన్నికల బిల్లు అంశంలో వెనక్కి తగ్గేదేలే అని కేంద్రం సంకేతాలు పంపించింది. లోకసభలో ఈబిల్లు ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. అందుకే బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఒక దేశం ఒకే ఎన్నికల బిల్లును మంగళవారం(17డిసెంబర్‌ 2024) మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ఈ జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నోట ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అనే అంశం ప్రతిధ్వనిస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ వేసిన కేంద్రం దీనికో రూపు తీసుకొచ్చింది. వెంటనే ఆ నివేదికను ఆమోదించిన కేంద్రమంత్రి వర్గం 2024 శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రక్రియను పూర్తి చేసింది.
‘ఒకే దేశం-ఒకే ఎన్నికల’కు సంబంధించిన ప్రతిపాదనను కాంగ్రెస్‌తోపాటు చాలా పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మోడీ మాటలు నమ్మవద్దని.. ‘ఇది దేశ సమాఖ్య నిర్మాణంపై దాడి అని ఆరోపిస్తున్నాయి. దీన్ని అధికార పార్టీ ఖండిస్తోంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా జమిలీ ఎన్నికలు అవసరమని వాదిస్తోంది. దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి, డబ్బు ఆదా అవుతుంది అంటున్నారు. దీని వల్ల సమాఖ్య వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదంటున్నారు.

ఒక దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏకాభిప్రాయాన్ని సాధించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. సవివరమైన చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా జేపీసీకి పంపవచ్చని తెలుస్తోంది. ఈ ప్రక్రియలో వీలైనంత మందిని చేర్చే అవకాశం ఉందని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మేధావులతో పాటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను కూడా పిలవవచ్చు. సామాన్యుల అభిప్రాయం కూడా తీసుకోనున్నారు.
ఏకాభిప్రాయం కుదరనప్పుడు… ప్రస్తుత వ్యవస్థను మార్చడం అంత ఈజీకాదు. ఒకే దేశం ఒకే ఎన్నికల పథకాన్ని అమలు చేయడానికి, రాజ్యాంగాన్ని సవరించడానికి కనీసం ఆరు బిల్లులను ప్రవేశపెట్టాలి. ప్రభుత్వానికి పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఎన్డీయేకు మెజారిటీ ఉన్నప్పటికీ, ఏ సభలోనైనా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం కష్టమైన పనే.

పార్లమెంటులో ఎవరికి మెజారిటీ ఉంది?
రాజ్యసభలోని 245 సీట్లలో ఎన్డీయేకు 112 సీట్లు, ప్రతిపక్షాలకు 85 సీట్లు ఉన్నాయి. మూడింట రెండొంతుల మెజారిటీకి ప్రభుత్వానికి కనీసం 164 ఓట్లు అవసరం. లోక్‌సభలోని 545 స్థానాలకి ఎన్డీయేకు 292 సీట్లే ఉన్నాయి. మూడింట రెండు వంతుల మెజారిటీ సంఖ్య 364 అయితే పరిస్థితి మారవచ్చు.

ఎందుకు జమిలీ జపం?
ఇప్పుడు ఉన్న విధానం వల్ల సమయం, డబ్బు, శ్రమ వృథా అవుతోందన్న వాదన ఉంది. అందుకే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతోంది. ఎన్నికల టైంలో అమలులో ఉండే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అభివృద్ధి పనులకు బ్రేకులు వేస్తోంది. వీటికి పరిష్కారమే జమిలీ ఎన్నికలు అంటోంది బీజేపీ. దీన్ని అమలుకు విధి విధానాలు ఖరారు చేసేందుకుమాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ వేసింది.

‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’పై ఏర్పాటైన కోవింద్ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీని చేర్చారు. న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ నితేన్ చంద్రను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు.

నివేదికలోని సిఫార్సులు ఏమిటి?
‘ఒకే దేశం, ఒకే ఎన్నికల’పై కమిటీ నివేదికలో రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు సంబంధించిన సిఫార్సులు చేసింది. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. మొదటి దశలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. రెండో దశలో మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు చేపట్టాలని చెప్పింది. మొదటి దశ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోగా మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలను నిర్వహించే విధంగా సమన్వయం చేసుకోవాలని పేర్కొంది.

ఈ 2024 మార్చిలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఈ కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. 2029 తర్వాత మాత్రమే “ఒక దేశం ఒకే ఎన్నికలు” అమలు చేయవచ్చని కోవింద్ నివేదిక సిఫార్సు చేసింది. దీన్ని 2024 సెప్టెంబర్ 18న మోదీ కేబినెట్ ఆమోదించింది. అన్ని అసెంబ్లీల పదవీకాలాన్ని 2029 వరకు పొడిగించాలని కమిటీ సూచించింది.

ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత డబ్బు ఆదా అవుతుంది?
2018 సంవత్సరంలో రూపొందించిన అంచనాల ప్రకారం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహిస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.10 వేల కోట్ల భారం పడింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ నివేదికలో ఇది రూ. 10 నుంచి 12 వేల కోట్లుగా అంచనా వేసింది. అయితే ఈ ఎన్నికలు ఏకకాలంలో జరిగితే ఈ సంఖ్య రూ.4500 కోట్లకు తగ్గుతుంది. అంటే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా దాదాపు రూ.5500 కోట్ల మేర ఆదా అవుతుంది.

ఎన్నికల సంఘం ఎక్కడ ఖర్చు చేస్తుంది?
లోక్‌సభ ఎన్నికలు అయినా, అసెంబ్లీ ఎన్నికలు అయినా ఎన్నికల సంఘం అనేక రకాల ఖర్చులను భరించాల్సి ఉంటుంది. ఇందులో అధికారులు, సాయుధ బలగాల మోహరింపు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) కొనుగోలు, ఇతర అవసరమైన పరికరాల ఏర్పాటుపై ఖర్చు పెడుతుంది. అవగాహన కార్యక్రమాల నిర్వహణకు కూడా ఖర్చు అవుతుంది.

ఈవీఎంల కొనుగోలుకు ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఎన్నికల సంఘం తన అధికారులు, వాలంటీర్లకు ఎన్నికల విధుల కోసం చెల్లించాలి. అధికారులు శిక్షణ, ప్రయాణాలకు డబ్బు చెల్లిస్తారు. ఎన్నికల ప్రచారాలు, రాజకీయ పార్టీల ఓటింగ్ ప్రక్రియ పరిశీలన కోసం చేసే ఖర్చు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి. 1957, 1962, 1967 వరకు భారతదేశంలో జమిలీ ఎన్నికలే జరిగాయి. ఆ తర్వాత దేశంలో ఎప్పుడూ ఒకేసారి ఎన్నికలు జరగలేదు.

‘ఏకకాల ఎన్నికలు’ ఎలా నిలిచిపోయాయి
స్వాతంత్య్రానంతరం దేశంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1960 నాటికి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పట్టు కోల్పోయింది. 1967లో తొలిసారిగా నెహ్రూ లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. కేంద్రంలో ఎలాగోలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా 6 రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. హర్యానా, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మారిన రాజకీయాలతో అసెంబ్లీ ముందుగానే రద్దు అయింది. పలుమార్లు సీఎంను మార్చడం, అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా రాష్ట్రపతి పాలన విధించారు.

ఈ క్రమంలోనే 1971లో సాధారణ ఎన్నికలు వచ్చాయి. అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయీకరణ, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌ను వేరు చేసిన కారణంగా ప్రజాదరణ పొందారు. ఈ సమయంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వస్తుందని ఆశించి 1972లో జరగాల్సిన ఎన్నికలు 1971లోనే జరిపారు. ఆ టైంలోనే వివిధ రాష్ట్రాల్లో శాసనసభ రద్దు కావడంతో ఎన్నికలు జరిగాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ రద్దు టైం ఉండటంతో రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య ఎన్నికల దూరం పెరగుతూ వస్తోంది.

1983లో మొదలైన జమిలీ ఎన్నికల ఆలోచన
1983లో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి జమిలీ ఎన్నికల ప్రతిపాదనను భారత ఎన్నికల సంఘం చేసింది. దాన్ని అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాని అయిన మళ్లీ వన్‌ నేషన్ వన్‌ ఎలక్షన్‌పై చర్చ జరిగింది.

1999, 2015లో జమిలీ ఎన్నికలపై లా కమిషన్ నివేదిక
1999లో లా కమిషన్ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని నివేదిక సమర్పించింది. దీని తర్వాత 2014 సంవత్సరంలో బిజెపి లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చింది. 2014 మేలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై మరోసారి చర్చ మొదలైంది. 2015లో లా కమిషన్ వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై నివేదిక సమర్పించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే కోట్లు ఆదా అవుతాయని చెప్పింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమస్య పదే పదే ఉండదని అభివృద్ధి పనులకు ఆటంకం ఉండదని తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది.

ప్రధాని మోదీ జమిలీ ఎందుకు కోరుకుంటున్నారు?
2017లో నీతి ఆయోగ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణపై స్పష్టత ఇచ్చింది. 2018 ఆగస్టులో లా కమిషన్ మరో నివేదిక ఇచ్చింది. 2019లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఖర్చు రూ.4,500 కోట్లు తగ్గుతుందని చెప్పింది. దీంతో 2019లో తొలిసారిగా ప్రధాని మోదీ ఈ అంశంపై అన్ని పార్టీలతో అధికారికంగా సమావేశమయ్యారు.

2023లో కోవింద్ కమిటీ ఏర్పాటు
కోవింద్ కమిటీని 2 సెప్టెంబర్ 2023న ఏర్పాటు చేశారు. దాదాపు 190 రోజుల పాటు రాజకీయ పార్టీలు, వివిధ భాగస్వాములతో మేధోమథనం చేసి 18,626 పేజీల నివేదికను కమిటీ సిద్ధం చేసింది. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ సాధారణ ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంది. సాధారణ ప్రజల నుంచి 21,558 సూచనలు వచ్చాయి. 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు, సూచనలను అందించాయి. ఇందులో 32 పార్టీలు మద్దతు ఇచ్చాయి. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’కు అనుకూలంగా మొత్తం 80 శాతం సూచనలు వచ్చాయి. ఈ కమిటీ దేశంలోని ప్రధాన పరిశ్రమల సంస్థలు, ఆర్థికవేత్తల నుంచి సూచనలను తీసుకుంది.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏ దేశాల్లో జరుగుతుంది?
1. దక్షిణాఫ్రికా
కోవింద్ కమిటీ నివేదిక ప్రకారం, దక్షిణాఫ్రికాలోని ఓటర్లు జాతీయ అసెంబ్లీ, ప్రావిన్షియల్ ఎమ్మెల్యేలకు ఏకకాలంలో ఓటు వేస్తారు.

2. స్వీడన్
స్వీడన్‌లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా పార్లమెంట్, కౌంటీ, మునిసిపల్ కౌన్సిల్‌ల ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయి.

3. బెల్జియం
బెల్జియంలో యూరోపియన్ యూనియన్ ఎన్నికలతోపాటు ఫెడరల్ పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతాయి.

4. జర్మనీ
జర్మన్ పార్లమెంట్ దిగువ సభకు అంటే బుండెస్టాగ్, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విధానం ఉంది.

5. ఫిలిప్పీన్స్
ఫిలిప్పీన్స్‌లో జాతీయ, స్థానిక అధికారుల ఎన్నికలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకేసారి జరుగుతాయి.

6. ఇండోనేషియా
ఇండోనేషియా ఇటీవల వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను ఆమోదించింది. ఈ సంవత్సరం, ఫిబ్రవరి 2024లో రాష్ట్రపతి, పార్లమెంటు, ప్రాంతీయ అసెంబ్లీ, మునిసిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆమోదం పొందితే దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు అన్ని రాష్ట్రాల్లోని మొత్తం 4130 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి ఓటర్లు ఒకే రోజు ఒకే సమయంలో ఓట్లు వేస్తారు.

తరవాత కథనం