శ్రీతేజ్‌ ఆస్పత్రి ఖర్చులు కూడా ప్రభుత్వానివే – తప్పు పుష్పా.. తప్పు !

Allu Arjun

Sandya Stampade: సినిమా వాళ్ల గురించి బయట రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఇంత చీప్ గా ఉంటారా అని జనం అనుకుంటూ ఉంటారు. అంత కంటే చీప్ గా ఉంటారని వారి గురించి కొన్ని నిజాలు బయటపడినప్పుడు అందరికీ అర్థమవుతూ ఉంటుంది. అలాంటిదే ఈ ఘటన కూడా.  సంధ్యా ధియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కోమాలో ఉన్న  అల్లు అర్జున్ చిన్నారి అభిమాని శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు అటు అర్జున్ కానీ.. ఇటు సినిమా యూనిట్ కానీ.. పెట్టుకోవడం లేదు. పూర్తిగా ప్రజలపై భారం వేశారు.  

వెంటిలేటర్ మీదనే శ్రీతేజ్ ..రోజుకు లక్షల ఖర్చు !

శ్రీతేజ్ ..ఆస్పత్రిలో వెంటిలేటర్ మీద ఉన్నారు. నిండా పదేళ్లు కూడా లేని ఆ పిల్లవాడి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది.  కానీ ఒక్కరంటే ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో బన్నీవాస్ వెళ్లి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చి వచ్చారు.  ఓ వైపు లాన్‌లో లైవ్‌లు చూస్తున్న జనం , మరో వైపు చిన్న బిడ్డను కంపేర్ చేసుకుని చాలా మంది ఇదేం పద్దతి అనుకుంటున్నారు.  బన్నీ వాస్ వెళ్లినా.. బన్నీ వీడియో రిలీజ్ చేసినా అదంతా ప్రచారానికి నిజానికి ఆ పిల్లవాడి వైద్యానికి ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదు. 

కోమాలోకి ఎంత కాలం ఉండాలో తెలియదు !

సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో కోమాలోకి వెళ్లిపోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్ కు కిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్‌కు భారీగా డ్యామేజ్ జరగడంతో కోమాలోకి వెళ్లిపోయారు. ఆ పిల్లవాడు కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కోమా నుంచి ఎప్పుడు బయటకు వస్తారో చెప్పలేకపోతున్నారు. అత్యాధునిక పరికరాలతో ప్రస్తుతం ప్రాణం నిలబెడుతున్నారు.   వైద్యం కోసం ఎంత ఖర్చు అవుతుందో .. ఆ ఖర్చును ఎవరు భరిస్తున్నారో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు.   శ్రీ తేజ్ తండ్రికి అంత వైద్యఖర్చులు భరించే శక్తి లేదు. తొక్కిసలాట జరిగిన రోజున పోలీసులే ఆస్పత్రికి తరలించారు. మైత్రి మూవీస్ కానీ.. హీరో టీం కానీ ఆస్పత్రిని ఇప్పటి వరకూ సంప్రదించలేదని చెబుతున్నారు.  శ్రీ తేజ్ ను పరామర్శించిన సీపీ సీవీ ఆనంద్ వైద్య ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తోందని చెప్పారు. అంటే.. సినిమా టీం వైపు నుంచి ఎలాంటిసాయం లేదని తెలుస్తోంది. అయితే తామే చూసుకుంటామని నిర్మాణ సంస్థ, హీరో ప్రతినిధులు ప్రకటించారు కానీ.. అది ప్రకటనకే పరిమితమైంది.  

అభిమాని కుటుంబంపై పుష్పకు కనికరం ఉండదా ?

శ్రీతేజ్ అల్లు అర్జున్ వీరాభిమాని. అల్లు అర్జున్ ఇమిటేట్ చేస్తూ ఆ పిల్లవాడు చేసిన డాన్సులు వైరల్ అయ్యాయి. చుట్టుపక్కల వారంతా పుష్ప అని పిలుస్తారని ఆ తండ్రి చెప్పుకున్నాడు. అలాంటి అభిమానం పెంచుకోవడం ఆ పిల్లవాడి తప్పేమో కానీ.. అల్లు అర్జున్ అదృష్టం. ప్రీమియర్ షోస్ చూడాలని ఆ పిల్లవాడు పట్టుబడితే వాడి మాట కాదనలేక ఇంటిల్లీపాది .. ఒక్కో టిక్కెట్ వెయ్యి అయినా కొనుక్కుని వెళ్లారు. అదే ఆ కుటుంబానికి తీరని నష్టం చేసింది.   ఒక్క పన్నెండు గంటలు జైల్లోనే ఉంటే.. ఏదో జరిగిపోయినట్లుగా రోజంతా పరమర్శలు పెట్టుకున్నారు మరి ఆ కుటుంబానికి ఎవరు భరోసా.. ?  ఎంత ఖర్చు అయినా ఆ పిల్లవాడి ప్రాణం నిలబెడితే.. ఆ డబ్బుకు కాస్త సార్థకత లభిస్తుంది. ఈ అంశంలో ప్రభుత్వం ఆ పిల్లవాడిని కాపాడేందుకు  శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ప్రకటనల ప్రకారం.. ఆ సినిమా టీం కూడా స్పందించాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం వైద్య సాయం అయినా అందించాల్సి ఉంది. 

తరవాత కథనం