Police Vs Allu Arjun: పోలీసులతో మంచి సంబంధాలు ఉండాలని పెద్దలు కోరుకుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు. వారు కోరాలే కానీ ఎలాంటి చిన్న కార్యక్రమానికైనా హాజరయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తారు. వారి గుడ్ లుక్స్ తమ మీద ఉండాలనుకుంటారు. అలా లేకపోయినా న్యూట్రల్ గా ఉంటే చాలనుకుంటారు. కానీ టార్గెట్ చేసుకోవాలని మాత్రం ఎవరూ అనుకోరు. కానీ అనూహ్యంగా అల్లు అర్జున్ విషయంలో యాంటీగా మారిపోయారు. ఆయనకు రాబోయే రోజుల్లో ఎన్ని చిక్కులు ఎదురవుతాయో అంచనా వేయడం కష్జం.
పోలీసులపై తప్పు తోసేసే ప్రయత్నం చేసి ఇరుక్కుపోయిన అర్జున్
హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లకపోవచ్చు కానీ కింది కోర్టులో బెయిల్ రాకుండా చేయాల్సినదంతా చేస్తారు పోలీసులు. హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది. కిందికోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుని .. బెయిల్ తెచ్చుకోవాలని సూచించింది. ఇంకా నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయలేదు. ఎందుకు ఎదురు చూస్తున్నారో తెలియదు. కానీ పోలీసులు మాత్రం.. ఏ మాత్రం చాన్స్ వచ్చినా.. ఖచ్చితంగా అరెస్టు చేసి జైలుకు పంపుతారు. కింది కోర్టులో బెయిల్ తిరస్కరణకు గురైతే వెంటనే అరెస్టు చేస్తారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి.. వచ్చే వరకూ జైల్లో ఉండాల్సి ఉంటుంది.
ఇక పోలీసులు కనీసం జాలి చూపరు !
ఇంత జరిగిన తర్వాత పోలీసులు ఇక దయ చూపే అవకాశం లేదు. ఆయనపై ఎంత హైలెవల్లో చార్జెస్ పెట్టాలో అంతా పెడతారు. కాపాడుకోవడానికి నిరంజన్ రెడ్డి అండ్ టీం చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. క్వాష్ పిటిషన్ మీద అత్యవసర విచారణలో బెయిల్ ఆన్ లైన్ లో వాదించేసి .. పోలీసుల తప్పని న్యాయమూర్తికి చెప్పి బెయిల్ ఇప్పించేసినంత ఈజీగా ఇక ఉండకపోవచ్చు. ఫలితం మాత్రం అర్జున్ అనుభవించాల్సిందే. ఎందుకిలా జరిగిందంటే.. పూర్తి స్థాయిలో లీగల్ టీమ్ వల్లనే అని అనుకోవాలి.
లీగల్ టీమే తప్పుదోవ పట్టించిందా?
అల్లు అర్జున్ కు తాత్కాలిక బెయిల్ ఇప్పించిన లాయర్ నిరంజన్ రెడ్డి ఎప్పటిలానే తన టెంప్లెట్ లాయర్ తెలివితేటల్ని హైకోర్టులో ప్రదర్శించారు. తప్పు అంతా పోలీసులదే అని ఎత్తి చూపుతూ వాదనలు వినిపించారు. తమ సిన్సియారిటీని నిరూపించుకునే అవకాశం కూడా పోలీసులకు రాలేదు. తర్వాత అల్లు అర్జున్ అదే లీగల్ టీం బ్రీఫింగ్తో మొత్తం నిందను పోలీసులపై తోసేశారు. పోలీసులే తన రూట్ క్లియర్ చేశారని అనుమతి లేకపోతే ఎందుకు చేశారన్నట్లుగా ఆయన ప్రశ్నించారు. సినిమా హాల్లో తన వద్దకు పోలీసులే రాలేదని చెప్పారు. ఈ వ్యవహారాలన్నీ సంచలనంగా మారాయి. పోలీసు వ్యవస్థ కూడా ఎందుకు భరించాలని బయటకు వచ్చింది.
ఈ ఫైర్ ఎప్పటికి ఆరుతుంది ?
అర్జున్ ప్రెస్మీట్లో అంతా పోలీసులదే తప్పు అని ఎందుకు చెప్పారు. అక్కడే అసలు విషయం ఉంది. ప్రెస్ మీట్ లో ఏం చెప్పాలో కూడా లీగల్ టీమే డిసైడ్ చేసిందని అంటున్నారు. న్యాయపరంగా సమస్యలు రాకుండా.. రాజకీయ పరంగా సమస్యలు రాకుండా.. మాట్లాడాలని ఆ పాయింట్లు రాసిచ్చారు. తన ఇమేజ్ దెబ్బతింటోందని చెప్పమన్నారు. కానీ అక్కడ అర్థంవేరేలా ప్రజల్లోకి ముఖ్యంగా.. పోలీసుల్లోకి వెళ్లిపోయింది. లీగల్ టీం చేసిన తప్పిదంతో మొదటికే మోసం వచ్చింది. అసలు ముఖ్యమంత్రి సభలో ఏం మాట్లాడారన్నదాన్ని మర్చిపోయి.. అంతా చట్టపరమైన ప్రక్రియకు వదిలేసి ఉంటే సమస్య ఉండేది. కానీ అల్లు అర్జున్ లా టీం మాత్రం ఆయనను నిలువునా ఫైర్ లో పడేసింది.