YSRP Latest News: జగన్ భక్తులకు దబిడి దిబిడే- చుట్టుముడుతున్న కేసులు- తప్పించుకునే దారే లేదా?

YS Jagan

Andhra Pradesh News: 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు రోజులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగించిన అధికారులను కేసులు చుట్టుముడుతున్నాయి. నాటి ప్రతిపక్షాన్ని కనీస గౌరవం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి కేసులతో హింసించిన వారందరు ఇప్పుడు బుక్ అవుతున్నారు. జిల్లా ఎస్పీల నుంచి వివిధ శాఖల కార్యదర్శుల వరకు అందా ఏదో కేసులో బుక్ అవుతున్నారు.

నటి జత్వానీతో మొదలై….

ముంబయి నటి కాదంబరి జత్వానీ విషయంలో ఐపీఎస్‌ల చుట్టూ వ్యవహారం నడిచింది. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. ఈ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీ, వైసీపీ లీడర్‌ విద్యాసాగర్‌ కూడా ఇరుక్కున్నారు. అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు కూడా వేసింది. అక్రమ కేసులో ఆమెను అరెస్టు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రభుత్వం తేల్చి వారిపై చర్యలు తీసుకుంది.

ఇసుకలో దోపిడీ

ఖనిజ శాఖలో రూ.2,566 కోట్ల ఇసుక కుంభకోణం జరిగిందంటూ కేసు నమోదు అయింది. దీనిపై విచారణ చేస్తున్న ఏసీబీ అప్పటి గనుల శాఖ డైరెక్టర్‌ను వీజీ వెంకటరెడ్డిని సెప్టెంబర్ 26న అరెస్టు చేసింది. ఆయనతో మొత్తం వ్యవహారం నడిపించారని విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. ఆయన విచారణకు సహకరించడం లేదని తేలింది. ఆయన నోరు తెరిస్తే కీలకమైన వ్యక్తుల బండారం బయటపడుతుందని అంటున్నారు.
వెంకటరెడ్డి మైన్స్‌ డైరెక్టర్‌గా ఉన్న టైంలో ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని జులైలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఫిర్యాదు అందింది. ఎన్జీటీ ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఇసుకను దోచి పంచి పెట్టారని పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఏసీబీ సెక్షన్లు 7, 9, 10, 12,13(1)(ఎ) కింద సెప్టెంబర్ 11న ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తోంది.

రఘురామకృష్ణరాజుపై థర్డ్‌ డిగ్రీ

వైసీపీ అధికారంలో ఉన్నటైంలో సంచలనం రేపిన కేసు రఘురామ కృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగం. దేశ ద్రోహం కింద అరెస్టు చేసిన తర్వాత 2021లో సీఐడీ కార్యాలయంలో తనను కొట్టారని అప్పట్లోనే కేసు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసులో విజయ్‌పాల్‌ను అరెస్టు చేశారు. ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించినా ఇంకా కేసులో పురోగతి లేదని తెలుస్తోంది. ఈ కేసులో కూడా అధికారుల మెడకు కత్తి వేలాడుతోంది.

సంజయ్‌ సైలెంట్ దోపిడీ

మార్గదర్శి, చంద్రబాబు కేసుల్లో హల్ చల్ చేసిన నాటి సీఐడీ చీఫ్ సంజయ్‌ చుట్టు ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. తన హోదాను అట్టుపెట్టుకొని కోటీ 75లక్షల మేర నిధులు పక్కదారి పట్టించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎన్‌వోసీ ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు అగ్ని యాప్‌ నిర్వహణ, ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్ట్‌ను సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాకు, ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ సదస్సుల నిర్వహణ కాంట్రాక్టు క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌కు అక్రమంగా కట్టబెట్టారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ సంస్థలకు మోసపూరితంగా బిల్లులు ఇచ్చి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని తేల్చింది.

సంజయ్‌పై ఏసీబీ చట్టంలోనే సెక్షన్‌ 13(1)(ఏ) రెడ్‌విత్‌ 13(2), సెక్షన్‌ 7తో పాటు ఐపీసీలోని 409 (నేరపూరిత విశ్వాసఘాతుకం), 420 (మోసం), 477ఏ (ఫాల్సిఫికేషన్‌ ఆఫ్‌ ఎకౌంట్స్‌), 120బీ (నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఇందులో ఏ1 సంజయ్‌ను, A2గా సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను, A3గా క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను (ఏ3)గా అధికారులు చేర్చారు.

టెండర్ల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా సౌత్రికా టెక్నాలజీస్‌కు పనులేవీ జరగక్కుండానే రూ.59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు. సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల కోసమంటూ క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ను టెండర్లు కట్టబెట్టారు. ఒప్పందం జరిగిన వారం రోజుల్లోనే రూ.1.19 కోట్ల బిల్లు చెల్లించారు.సంజయ్‌ అక్రమాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం లోతుగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసి సమగ్ర దర్యాప్తునకు ఏసీబీకి ఆదేశించింది

సమాచారం శాఖలో కూడా దుర్వినియోగం

జగన్‌ ప్రభుత్వ హయాంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా ఉన్న తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి కూడా కేసుల చట్రంలో ఇరుక్కున్నారు. ప్రభుత్వ ప్రకటనల జారీ, బిల్లుల చెల్లింపులో ఓపత్రిక, ఓ టీవీ ఛానల్‌కు లబ్ధి చేకూర్చారని ఏసీబీ కేసు నమోదు చేసింది. 2019-24 మధ్య కాలంలో ఆ జగన్ మీడియాకు రూ.371.12 కోట్ల ప్రకటనలు ఇస్తే… మిగతా మీడియాకు రూ.26.71 కోట్ల ప్రకటనలు ఇచ్చారని తేల్చింది. కొన్ని పత్రికలు, ఛానళ్లకు అసలు ప్రకటనలే ఇవ్వలేదని పేర్కొంది.

అంతే కాకుండా జగన్ మీడియా గ్రూప్‌లో పని చేసిన సిబ్బందిని ఐ అండ్‌ పీఆర్, ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్లలో ఉద్యోగులుగా నియమించినట్టు తేల్చింది. ఈ ఆరోపణలతో విజయ్‌కుమార్‌ రెడ్డిపై ఐపీసీ 120బి (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టంలోని 7, 13(2) రెడ్‌విత్‌ 13(1) (ఎ) సెక్షన్ల కింద ఏసీబీ సెప్టెంబరు 14నే కేసు నమోదు చేసింది.
ఇవి కేవలం అధికారుల మీద వేస్తున్న కేసులే ఇంకా ఆ పార్టీ నేతలపై నమోదు అవుతున్న కేసులు పదుల సంఖ్యలో ఉన్నాయి.

తరవాత కథనం