Tug of war between Tollywood and the government : తెలంగాణలో ప్రభుత్వం మారి ఏడాది అయిపోయింది. ఈ ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమానికీ టాలీవుడ్ నుంచి మద్దతు రాలేదు. చివరికి గద్దర్ అవార్డులు ఇస్తామన్నా పట్టించుకోలేదు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో టాలీవుడ్ కు సహకరిస్తోంది. టిక్కెట్ రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో అసలున నిరాశపర్చలేదు. అయినా రేవంత్ ప్రభుత్వ ఉనికి టాలీవుడ్ గుర్తించడానికి సిద్ధంగా లేకపోవడంతోనే సమస్యలు ప్రారంభమయ్యాయి.
టాలీవుడ్ లో ఎవరి అజెండా వారిదే !
ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ స్థానంలో ఉన్న వారిలో బీఆర్ఎస్ నేతలతో వ్యాపార వ్యవహారాలు పెట్టుకుని వారి ఎజెండాకు తగ్గట్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తున్నారన్న కోపం ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవాలని టాలీవుడ్ కు చెందిన ఏ ఒక్కరూ అనుకోరు. గ్లామర్ ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం చాలా అవసరం. బీఆర్ఎస్ తో సాన్నిహిత్యం ఉన్న వారు కాక.. కాంగ్రెస్ నేతలతో పరిచయం ఉన్న వారు కాంగ్రెస్ పెద్దలతో టచ్ లోకి వెళ్లారు కానీ అది వారి వ్యక్తిగతం. టాలీవుడ్‌కు ఎలాంటి మేలు చేసే అవకాశం లేదు. టాలీవుడ్ మొత్తం ప్రభుత్వానికి దగ్గరయ్యే ప్రయత్నం చేయలేదు. దాని వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిన పచ్చిది.
ఏడాది పాటు చూసిన రేవంత్ రెడ్డి
టాలీవుడ్ విషయంలో రేవంత్ అసంతృప్తిగా ఉన్నారని చాలా సార్లు బయటపడింది. గద్దర అవార్డుల విషయంలో కలసి రావడం లేదు. కానీ టిక్కెట్ రేట్లపెంపు ఇతర విషయాల కోసం మాత్రం పరుగులు పెడుతూ వస్తున్నారు. ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే ముందుకు వస్తున్నారు. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కొండా సురేఖ మాట్లాడినప్పుడు టాలీవుడ్ చాలా ఓవరాక్షన్ చేసిందన్న అభిప్రాయం కాంగ్రెస్ లో ఉంది. అలాగే అల్లు అర్జున్ ను అరెస్టు చేసినప్పుడూ అంతే. ఇక టాలీవుడ్ విషయంలో సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదని.. కఠినమైన మార్గాన్నే ప్రభుత్వం ఎంచుకోవాలని డిసైడైన తర్వాత అరెస్టుల వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు రేవంత్ అధికారాన్ని గుర్తించడానికి టాలీవుడ్ సిద్దమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
బ్రిడ్జిగా మారుతున్న దిల్ రాజు
ఇండస్ట్రీతో ప్రభుత్వానికి సమన్వయం ఉండాలని రేవంత్ రెడ్డి కూడా కోరుకుంటున్నారు కానీ గొడవ పడాలని అనుకోవడంలేదు. అందుకే గ్యాప్ ను పూడ్చడానికి కాంగ్రెస్ పార్టీకి ఏమీ చేయకపోయినా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని దిల్ రాజుకు ఇచ్చారు. ఆయన ఇప్పుడు పెద్ద మనిషి పాత్ర పోషించి అందర్నీ ఏక తాటిపైకి తీసుకువస్తున్నారు. ఇక ముందు తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి సమస్యలు వచ్చినా దిల్ రాజు పరిష్కరిస్తారు. టాలీవుడ్ గ్లాస్ లాంటి ఇండస్ట్రీ.తమపై రాళ్లు పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు తమపై రాళ్లు వేయాలనుకుంటే అందుబాటులో కుప్పలు కుప్పలు ఉంటాయి. ఎందుకంటే ఇండస్ట్రీ అలాంటిది. అన్నీ చట్ట ప్రకారం చేయలేరు. పద్దతిగా ఏదీ నడపలేరు. అందుకే ఏ ప్రభుత్వం ఉన్నా వారితో పరిచయాలు పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
రెండు వర్గాలు పంతాలకు పోకుండా.. సహకరించుకుంటే విన్ విన్ అనే సిట్యయేషన్‌కు వచ్చే అవకాశం ఉంది. మరి టగ్ ఆఫ్ వార్ కొనసాగిస్తారా? రెండు వర్గాలూ విజయం సాధిస్తాయా?