Pawan Kalyan PR Stunts: పవన్ కల్యాణ్ చరిత్రలో చూడనంత అభివృద్ధి చేస్తున్నారని ఆయన పీఆర్ టీం ప్రచారం ప్రారంభించేసింది. కానీ ఇదిరాను రాను కామెడీగా మారుతోంది. ఆరు నెలల్లోనే ఆయన ఏపీలో ఉన్న సిమెంట్ రోడ్లన్నీ వేయించేశారని ప్రచారం చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పీఆర్ టీం, జనసేన పార్టీ సభ్యుల అతి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆరు నెలల్లో పవన్ ఏం చేశారో ప్రత్యేకంగాఎవరికీ అర్థం కావడం లేదు. కానీ ప్రచారం మాత్రం పీక్స్ లో ఉంది.
సిమెంట్ రోడ్లు వేసింది గోరంత – ప్రచారం కొండంత
ప్రభుత్వం మారిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. పదకొండు వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. ఆమోదంతెచ్చుకున్నారు. గ్రామసభల్ని ఒకేసారి ఏర్పాటు చేశారు. పనులకు ఆమోదం లభించేలా చేశారు. తర్వాత పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల నిర్మాణం ప్రారంభమయింది. మన్యం గ్రామాల్లోనూ పనులు సాగుతున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ మన్యం గ్రామాల్లో స్వయంగా పర్యటించారు. అక్కడికి గతంలో ఏ లీడర్ పోనట్లుగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ గ్రామాల్లో చాలా వరకూ సమస్యలు లేవు. డోలీ సమస్యలు ఉన్న గ్రామాలు వేరు. వాటిలో రోడ్లు నిర్మించాలని పవన్ కల్యాణ్ అనుకున్నది కాదు. అధికారపరంగా జరిగిన ప్రాసెస్. అయితే రెండు రోజుల పర్యటన ద్వారా బురదలో నడిచి ఆ ఫోటోలను హైలెట్ చేసుకోవడం ద్వారా పవన్ ఎక్కువ ప్రచారం చేసుకున్నారు.
మావోయిస్టుల సమస్య తగ్గడంతోనే నిర్మాణాలు
గిరిజన ప్రాంతాల్లో డోలీ సమస్యలు ఉన్న గ్రామాల్లో రోడ్లు వేయడానికి నిధుల సమస్య ఎప్పుడూ లేదు. కానీ అక్కడ నక్సలైట్ల సమస్య ఉంది. ఎవరైనా రోడ్ కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తే అతని వాహనాల్ని నక్సలైట్లు తగులబెట్టేస్తారు. దాడులు చేస్తారు. ఈ కారణంగా పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రారు. కానీ పవన్ పెద్దగా భద్రతా సిబ్బంది లేకుండానే ఆయా గ్రామాల్లో పర్యటించి కాంట్రాక్టర్లలో ధైర్యం నింపారని చెప్పుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు మన్యంలోని దాదాపుగా 55 గ్రామాలకు డోలీ సమస్య తీరిందని గడచిన 70 సంవత్సరాలలో గిరిజన డోలీలు టీవీ చర్చలకు, అసెంబ్లీ డిబేట్ లకు మాత్రమే ఉపయోగపడ్డాయని కానీ సమస్యను పరిష్కరించింది పవన్ అని చెప్పుకుంటున్నారు. ఈ అతి పీఆర్ అనర్థాలకు దారి తీస్తుందన్న ఆందోళన కొంత మంది జనసైనికుల్లో వ్యక్తమవుతోంది.
ఆరు నెలల్లో పవన్ చేసింది ఏమీ లేదు!
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రుల పనితీరుపై కేబినెట్ లో ఓ నివేదిక ప్రవేశ పెట్టారు. అందులో పవన్ తో పాటు లోకేష్ పనితీరు అప్ టు మార్క్ లేదని తేల్చారు. ఇది పీఆర్ స్టంట్లు, సోషల్ మీడియాలో చేసుకునే ప్రచారానికి ఇచ్చే సర్టిఫికెట్ కాదు. పనితీరు, ఫలితాలకు ఇచ్చే గుర్తింపు. చంద్రబాబు ఇలాంటి వాటిని ఇంకాచాలా ప్రవేశపెడతారు. పవన్ కొత్తగా మంత్రి అయ్యారు. ఏదో చేయాలనే తపనలో ఉంటారు. కానీ ముందు ప్రచారం చేసుకోవడం మాత్రం మైనస్ అవుతుంది.