ఒక ఉమ్మడి కుటుంబాన్ని నడపాలంటే ఎంత కష్టమో తెలిసింది. ఓ ఆఫీస్‌లో పది మంది భిన్నమైన మైండ్‌సెట్ ఉన్న వ్యక్తులను ఒకే దారిలో నడిపించి విజయాలు సాధించాలంటే మామూలు విషయం కాదు. అలాంటిది సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాలంటే కత్తి మీద సామే. అలాంటి సాహాన్ని ఇద్దరే ఇద్దరు చేయగలిగారు. అందులో ఒకరు మన్మోహన్ సింగ్ అయితే. రెండో వ్యక్తి అటల్ బిహారీ వాజ్‌పేయీ. మొదట్లో వాజ్‌పేయీ కాస్త తడబడినా తర్వాత తేరుకొని విజయవంతంగా అతుకుల ప్రభుత్వాలను నడిపించగలిగారు.
విభిన్న లక్ష్యాలు, అంతకు మించి బ్లాక్మెయిల్ పాలిటిక్స్ ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడమే కాకుండా ఆర్థిక రంగాన్ని దేశాభివృద్ధిని పరుగులు పెట్టించారు. దేశ ప్రజలకు ఎంతోకొంత మేలు చేశారు. నేటికీ ఆ మేలు చూస్తున్న ప్రజలు వారి సేవలను గుర్తు చేసుకుంటున్నారు. భవిష్యత్ తరాలు కూడా వారి సర్వీస్‌ను స్మరించుకూనే ఉంటారు. అంతలా దేశంపై ప్రభావం చూపారు. ఓ ట్రెండ్ సెట్ చేశారు.
యాదదృచ్చికమో దైవ నిర్ణయమో కానీ వాజ్‌పేయి శత జయంతి తర్వాత రోజునే మాజీ ప్రధాని మనోహన్ సింగ్ కన్నుమూశారు. 92 ఏళ్ల ఈ ఆర్థిక మేధావి ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో దేశంలో ఓ గొప్ప ఆర్థికవేత్తనే కాదు నిగర్వి, నిరాడంబరమైన రాజకీయనేతను కోల్పోయిందని యావత్ దేశం స్మరించుకుంటోంది. ఆయనకు ఘన నివాళి అర్పిస్తోంది.
మన్మోహన్ సింగ్ ఏ పని చేపట్టినా అందులో సాహసాలు చేయడం ఆయనకు అలవాటు. చేసే పనిలో ది బెస్ట్‌గా ఉండాలని కలలు కనే వాళ్లు. పంజాబ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు కానీ లెక్చర్‌గా పని చేస్తున్నప్పుడు అదే చేశారు. అనంతరం చేపట్టిన ఆర్థిక శాఖ బాధ్యతల్లో అదే ఒరవడి కొనసాగించారు. అందుకే తక్కువ టైంలోనే ఆర్థిక మంత్రిగా ఎదిగారు.
ఆర్థిక మంత్రిగా కూడా అప్పటి వరకు రాజకీయ ఉద్దండులను ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకున్నారు మన్మోహన్. దేశంలో ఏం జరుగుతుందో ఏమైపోతుంందో అంటూ నాటి ఆర్థిక విశ్లేషకులు ఆశ్చర్యపోయారు. అయినా ఆయన తాను దేశానికి చేయబోయే మంచిని మాత్రమే చూశారు. తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోలేదు. నాడు ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలే నేడు దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి.
భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటన్న 1991లో ద్రవ్యలోటు జీడీపీలో 8.5 శాతానికి, కరెంటు ఖాతా లోటు జీడీపీలో 3.5 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరింది. మొన్నటికి మొన్న పాకిస్థాన్, శ్రీలంక ఎదుర్కొన్న దుర్బర పరిస్థితి అన్నమాట. రెండు వారాలు గడిస్తే విదేశాల నుంచి గుండు పిన్ను కూడా దిగుమతి చేసుకులేని దుస్థితికి చేరింది దేశం. ఇన్‌టైంలో ఆయా సంస్థలకు, దేశాలకు రుణాలకు వడ్డీలు కూడా చెల్లించలేని దౌర్భాగ్యం.
దేశ పరిస్థితి అంత క్లిష్టంగా ఉన్నటైంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నర్సింహారావు తన ఆర్థిక మంత్రిగా రాజకీయలతో సంబంధం లేదని మన్మోహన్ సింగ్‌కు అప్పగించారు. ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అప్పటికే ఆర్థిక శాఖ సలహాదారుగా సింగ్ చేసిన సాహసాలు అద్భుతాలు తెలిసిన వ్యక్తిగా పీవీ ఈ పని చేశారు. అనుకున్నట్టుగానే ఎవరూ ఊహించని ఎత్తుగడలతో దేశాన్ని దౌడు తీయించారు. తర్వాత ప్రధానమంత్రిగా కూడా ప్రజల మనసుల్లో ఎప్పటికీ ఉండిపోయే ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం లాంటి ఎన్నో అద్భుతమైన చట్టాలు తీసుకొచ్చారు. ఆయన ప్రధానిగా ఉన్న టైంలో చాలా మంది మంత్రులు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈయన కాంపౌండ్‌లోకి ఒక్క విమర్శ కూడా చేరుకోలేదు. మౌనమునిగానే విజయవంతంగా అందరి మనసులు గెలుచుకున్నారు
ఎలాంటి రాజకీయ నేపథ్యంలో ని మన్మహన్ సింగ్ ఇలాంటి అద్భుతాలు చేస్తే ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో తిరిగిన వాజ్‌పేయి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన కూడా ఉపాధ్యాయుడి కుమారుడిగా తన ప్రస్తానం ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిషనర్స్ను ఎదురొడ్డి నిలబడ్డ కుర్రాడు. ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వంపై ధిక్కార స్వరాన్ని వినిపించి జైలుకు వెళ్లారుకూడా.
అలా తన అడుగులు రాజకీయలవైపు వేశారు వాజ్‌పేయి. జనసంఘ్‌లో చేరి అనతి కాలంలోనే తన సత్తువతో ఉన్న స్థాయికి ఎదిగారు. ఆయన ఏ స్థాయిలో ఉన్నా సరే సామాన్యుడితో ఉన్న అనుబంధం మాత్రం ఒదులు కోలేదు. ప్రజలతో ఉండాలనే ఆలోచన వీడ లేదు. సమయం కుదిరినప్పుడు సామాన్యుల్లో ఒకడిలా కలిసిపోయేవాళ్లు. అలా జనంతో మమేకయ్యారు, మధ్యతరగతి నుంచి వచ్చారు కాబట్టే తన పాలనలో వారిని ఉద్దరించే సంస్కరణలు చేపట్టారు. నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
1984లో బీజేపీకి కేవలం రెండంటే రెండు సీట్లే వచ్చాయి. అయినా వాజ్‌పేయి అధైర్యపడలేదు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విజయవంతమయ్యారు. అధికారంలోకి వచ్చారు. అయినా కేవలం 13 రోజులకే ప్రభుత్వం పడిపోయింది. అది కూడా ఒక్క ఎంపీ సీటు తేడాతో. ఇది నిజంగా నేటి తరానికకి ఆశ్చర్యకలిగించక మానదు. అయినా సరే ఆయన మొహంలో చిరునవ్వు సడలిపోలేదు. మళ్లీ అదే టైంలో ఎన్నికలకు వెళ్లారు. మళ్లీ అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా క్షుద్ర రాజకీయాలకు పావుగా మారి 13 నెలలకే అధికారం కోల్పోయారు. ఈసారి ప్రజల్లో కూడా ఆయనపై నమ్మకం సడలిపోలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పాలించారు. దేశాన్ని సంస్కరణలతో మరో ఎత్తుకు తీసుకెళ్లారు.
సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా వాజ్‌పేయి చరిత్ర సృష్టించారు. పోఖ్రాన్ అణుపరీక్షలు, కార్గిల్ యుద్ధం, లాహోర్ బస్సు దౌత్యం, ఆగ్రా చర్చలు, కనెక్ట్ ఇండియా ప్రాజెక్టు, జాతీయ, గ్రామీణ రహదారులు, టెలికాం, మౌలిక వసతులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రైవేటు భాగస్వామ్యం వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. నేడు విశాలంగా ఉన్న జాతీయ రహదారులకు ఆధ్యుడు వాజ్‌పేయీ. అందుకే వాజ్‌పేయిని ఓ పార్టీ నేతగా కాకుండా జాతికి నాయకుడిగా ఇంటి మనిషిగా జనాలు గుండెల్లో పెట్టుకున్నారు.
మన్మోహన్ సింగ్, వాజ్‌పేయి ఇద్దరూ సంకీర్ణ ప్రభుత్వాలను విజయవంతంగా నడిపించడమే కాకుండా ప్రజలకు మేలు చేసే విధానాలు తీసుకొచ్చారు. కూటమి పార్టీల నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా అనకున్నది సాధించడంలో సక్సెస్ అయ్యారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ప్రజల మనన్నలు పొందారు. వారి దేశానికి చేసిన సేవలు నేడు రేపు ఎల్లప్పుడూ జాతిని, పాలకులను నడిపిస్తూనే ఉంటాయి.