పన్ను చెల్లింపుదారులకు ఊరట! ఈసారి బడ్జెట్‌లో మార్పులు ఖాయం!

Income taxpayers

పన్ను భారం నుంచి బయటపడేయాలంటూ వేతన జీవులు ఎప్పటి నుంచో వేడుకుంటున్నారు. ఏదో చిన్న చిన్న మార్పులతో సంతృప్తి పరుస్తున్న మోదీ ప్రభుత్వం పన్నుచెల్లింపుదారుల కొరికను మాత్రం తీర్చడంలేదు. బడ్జెట్‌ వచ్చిన ప్రతిసారీ ఆశపడటం బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నిరాశ చెందడం అలవాటు అయిపోయింది. అయితే ఈసారి మాత్రం అలాంటి గుడ్ న్యూస్ ఉంటుందని పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది.

ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట ఇచ్చే ఛాన్స్ ఉంది. ద్రవ్యోల్బణంతో భారం పడుతున్న పట్టణ మధ్యతరగతి వారికి మరింత ఉపశమనం కలిగించవచ్చు. ప్రస్తుతం పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుత ఉపశమనం ఏమిటి?
3 నుంచి 15 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 5 నుంచి 20 శాతం పన్ను వసూలు చేస్తోంది. అంతకు మించి సంపాదించే వారు తప్పనిసరిగా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం ప్రకారం స్లాబ్స్ మార్చవచ్చని అంటున్నారు. ఎంత ఏంటి అనేది ఖరారు కాకపోయినా మార్పు అయితే ఉంటుందని అంటున్నారు.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అంతకంటే ముందే ఆదాయ పన్నుపై నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఈ విషయంపై ఇంత వరకు అధికారికంగా బహిరంగా స్పందించలేదు.

సోషల్ మీడియా వేదిగా సమస్య చెప్పిన నెటిజన్ 

పన్ను మినహాయింపు ఇవ్వాలని చాలా ఏళ్లుగా మధ్యతరగతి ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ డిమాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్య స్పందించారు. పన్ను భారం తగ్గించాలని ఓ సోషల్ మీడియా యూజర్ ఆర్థిక మంత్రిని అభ్యర్థించగా ఆమె స్పందించారు. X లో ఓ నెటిజన్ ఇలా పోస్టు చేశారు. “మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కల్పించాలని నేను మిమ్మల్ని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను. ఇందులో ఉన్న సవాళ్లను నేను అర్థం చేసుకున్నాను, కానీ ఇది హృదయపూర్వక అభ్యర్థన.” అని ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు.

దీనిపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, “ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను అర్థం చేసుకుంటుంది. వారి సూచనలకు విలువనిస్తుంది. మీ సలహాకు ధన్యవాదాలు. మీ ఆందోళన నేను అర్థం చేసుకున్నాను. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను.” అని రియాక్ట్ అయ్యారు.

పన్ను విధానంలో మార్పు తెచ్చిన చేకూరని ప్రయోజనం 

ప్రధాని మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేకించి 20 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారిపై అప్పుల భారాన్ని తగ్గించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 10 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తుల నుంచి పన్ను వసూలు రేటు 2014లో 10.17 శాతం నుంచి 2024 నాటికి 6.22 శాతానికి తగ్గించింది. అయితే స్లాబ్‌లు మార్చి ఉపశమనం కల్పించాలని మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. ఇప్పటి వరకు చేసిన మార్పులతో తమ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని అంటున్నారు.

తరవాత కథనం