2025-26 Union Budget: 2025-26 కేంద్ర బడ్జెట్: మధ్యతరగతిపై నిర్మలా సీతారామణ కరుణ.. ఆదాయ పన్నులో రాయితీ?

2025-26 Union Budget Proposals

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. ఈసారి బడ్జెట్‌లో పన్నులపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది. వేతన జీవుల నుంచి వ్యాపారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, మధ్య తరగతి ప్రజలు వరకు ప్రతి ఒక్కరికి పన్నుల్లో ఉపశమనం పొందనున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో భారీ పన్నుల మోత నుంచి చెల్లింపుదారులకు రిలీఫ్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

ఈ బడ్జెట్‌లో పట్టణ ప్రాంతాల్లో నివసించే పన్ను చెల్లింపుదారులకు కొత్త మినహాయింపులు, లాభాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి రూ.15 లక్షల వరకూ ఆదాయం పన్ను పరిధి నుంచి మినహాయింపు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది మధ్య తరగతి వర్గానికి ఉపశమనం కల్పించనుంది. పట్టణాల్లో ఇప్పటికే లివింగ్ కాస్ట్ బాగా పెరిగింది. దానికి తోడు ప్రభుత్వ పన్నులు సామాన్యుడి జీవితాన్ని మరింత ఛిద్రం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకోబోయే నిర్ణయం ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.

2020లో కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త ఆదాయం పన్ను విధానంలో కొన్ని మార్పులు వచ్చాయి. కొత్త విధానం ప్రకారం, ఆదాయం పన్ను మినహాయింపుల్లో కొన్ని కీలక అంశాలను రద్దు చేశారు. ఇంటి అద్దెలు, పొదుపు పథకాల్లో మదుపు, సొంతింటి రుణంపై వడ్డీ, పిఎఫ్‌లపై మినహాయింపులు వంటి అంశాలకు మినహాయింపు లభించడం లేదు. అయితే, కొత్త విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులకు తక్కువ పన్ను చెల్లించే అవకాశం ఉంది.

కొత్త ఆదాయం పన్ను విధానం:

2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానంలో ఆదాయం పన్ను రేట్లు మారిపోయాయి. రూ.3-15 లక్షల మధ్య ఆదాయం గల వ్యక్తులపై 5-20 శాతం పన్ను విధించబడుతుంది. కేవలం రూ.3 లక్షల ఆదాయం వరకూ మాత్రమే పన్ను రాయితీ వర్తిస్తుంది. రూ.3-7 లక్షలలో 5%, రూ.7-10 లక్షలలో 10%, రూ.10-12 లక్షలలో 15%, రూ.12-15 లక్షలలో 20%, రూ.15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయం కల వారికి 30% పన్ను విధించబడుతుంది.

అయితే, ట్యాక్స్ పేయర్స్.. పాత పన్ను విధానాన్ని ఎంచుకొనె వెసులుబాటు ఉంది. ఈ విధానాన్ని ఎంచుకున్న వారు పన్ను మినహాయింపులను పొందవచ్చు. పాత విధానం ప్రకారం, ఇంటి అద్దెలు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, పొదుపు పథకాలు, సొంత ఇంటి రుణంపై వడ్డీ లాంటి అంశాలపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. అయితే, 2020లో తీసుకొచ్చిన కొత్త విధానం ఈ మినహాయింపులను రద్దు చేసింది. కొత్త విధానాన్ని కూడా ఆప్షన్‌గా అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు విధానాలు, పన్ను చెల్లింపుదారులకు వారి అవసరాల ప్రకారం ఉత్తమమైన పథాన్ని ఎంచుకునేందుకు అవకాశం కల్పిస్తాయి. కొత్త విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, పన్ను మినహాయింపులు లేకపోవడంతో కొంతమంది పాత విధానాన్ని ఎంచుకుంటున్నారు.

మధ్య తరగతి ప్రజలపై ప్రభావం:

నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో సమర్పించనున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే.. మధ్య తరగతి ప్రజలపై ఈ పన్నుల భారం భారీగా ఉంది. ఈ సమయానికి, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీతాల పెంపు లేకపోవడం వంటి అంశాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

రూపాయి డాలర్‌తో పోలిస్తే క్షీణత:

ఇక, ఇటీవల భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే దారుణంగా క్షీణించిందని రికార్డులు చెబుతున్నాయి. రెండు నెలల వ్యవధిలోనే రూపాయి విలువ రూ.84 నుంచి రూ.85 వరకు పడిపోయింది. దీనితో, భారత పన్ను చెల్లింపుదారులకు సవరించబడిన పన్ను విధానాలు మరింత భారంగా మారాయి.

భవిష్యత్తులో పన్ను విధానాలు:

కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయో, మినహాయింపుల ప్రకటన ఎలా ఉంటుందో, వాటి ప్రభావం మీద మరిన్ని వివరాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించిన తర్వాత తెలుస్తాయి. అయితే, మధ్య తరగతి ప్రజల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో, వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచేందుకు కేంద్రం మరిన్ని పన్ను మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తరవాత కథనం