Ambati Rambabu: రేవంత్ రెడ్డి ఓ చూపు చూస్తే అంబటి రాంబాబు పరిస్థితేంటి? ఎందుకలా రెచ్చగొడుతున్నాడు ?

రేవంత్ ను టార్గెట్ చేస్తున్న అంబటి

Ambati On Revanth:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అంబటి రాంబాబు పంచలు వేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా , సందర్భం ఉన్నా లేకపోయినా.. అక్కడ స్పేస్ లేకపోయినా సృష్టించుకుని మరీ దాడికి దిగుతున్నారు. అంబటిపై స్పందించేంత తీరిక కాంగ్రెస్ నేతలకు లేదు కానీ.. ఆయన వైపు రేవంత్ రెడ్డి టీమ్ ఓ చూపు చూస్తే రాంబాబు పరిస్థితి ఏమవుతుందో చెప్పాల్సిన పని లేదన్న సెటైర్లు మాత్రం.. ఆయన పెట్టే పోస్టుల కిందనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టినా రేవంత్ నే టార్గెట్ చేస్తున్న అంబటి

నితీష్ కుమార్ రెడ్డి మెల్బోర్న్‌లో  సెంచరీ చేసి తగ్గేదే లేదే అన్నట్లుగా బ్యాట్‌తో  చూపిస్తే దాన్ని రేవంత్ రెడ్డికి ముడిపెట్టేసి విమర్శలు గుప్పించారు అంబటి రాంబాబు. ప్రపంచ స్థాయికి వెళ్లిన పుష్పను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. అసలు నితీష్ కుమార్ రెడ్డి అలా అనడానికి..  సంధ్యా ధియేటర్ తొక్కిసలాట కేసుకు .. ఏమైనా సంబంధం ఉందా?. మళ్లీ సినిమాను , అర్జున్ ను తొక్కేస్తున్నారన్న అర్థంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఏ మాత్రం సంకోచించడం లేదన్నట్లుగా అంబటి రాంబాబు ఆరోపించడం రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టేందుకే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

సోఫాల కోసం రేవంత్ ప్లాన్ అని తీవ్ర ఆరోపణలు 

ఇటీవల సినీ ప్రముఖులు రేవంత్ తో భేటీ అయినప్పుడు రేవంత్ ఏదో సోఫాలు తీసుకుని పరిష్కారం చేస్తున్నట్లుగా ట్వీట్ పెట్టారు. ఇది ఎంత తీవ్రమైన ఆరోపణ. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకునేందుకు టాలీవుడ్ ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం అంటే.. ఆయన టీం సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది.  ఈ లొల్లిని రేవంత్ రెడ్డి టీం అంబటి వ్యక్తిగత వ్యవహారంగా చూడకుండా.. ఇదంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందని తమపై కుట్ర చేస్తున్నారని అనుకుంటే మాత్రం లెక్క మారిపోతుంది.  అసలే హైదరాబాద్ కు రావడానికి కూడా భయపడుతున్న జగన్ ఇక ముందు అడుగుపెట్టలేకపోకపోవచ్చు. ఆయనకు ఉన్న బినామీ ఆస్తుల లెక్క అంతా బయటకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయితే ఇది  జగన్ చేయిస్తున్నారని రేవంత్ రెడ్డికి అనిపిస్తేనే చేస్తారు. లేకపోతే అంబటినే టార్గెట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

అంబటి కావాలనే చేస్తున్నారా ?

 ప్రతీ దానికి ఇలా రేవంత్ రెడ్డిని, ఆయన క్యాంప్ ను ఇరిటేట్ చేసేందుకు అంబటి రాంబాబు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారన్నది వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు.. పార్టీ విధానం ప్రకారం పెడుతున్నారా లేకపోతే వ్యక్తిగతంగా రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారా అన్నది ఆయనకే తెలియాలి.  కానీ వైసీపీ నేతలకు అయినా .. అంబటి రాంబాబుకు అయినా హైదరాబాద్ తో చాలా అనుబంధం ఉంటుంది.  తేడా వస్తే ఏం చేయవచ్చో గతంలో కేసీఆర్ చేసి చూపించారు. అందుకే చాలా మంది అంబటి రాంబాబుపై గతంలో వచ్చినట్లుగా రాసలీలల కథలు బయటకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న వాదన వినిపిస్తోంది.  తమ సొంత రాష్ట్రంలో లాక్కోలేక పీక్కోలేక వైసీపీ నేతలు ఉంటే కొత్తగా రేవంత్ తో ఎందుకు టార్గెట్ చేయిస్తున్నారో వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు.

తరవాత కథనం