Telangana Congress: నూతన సంవత్సరం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను మారాను, మీరు కూడా మారండి అని ఎమ్మెల్యేలకు సందేశం పంపించారు. రేవంత్ కొత్తగా ఏ విషయాల్లో మారారన్నది మాత్రం పార్టీ శ్రేణులకు తెలియదు . కానీ ఆయన మారడం వల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని క్యాడర్ అనుకుంటున్నారు. పార్టీలో చేరిన వారితో కలిసి పని చేయాలని రేవంత్ చెబుతున్నారు. అసలు ఎందుకు చేర్చుకోవాలన్నది ఎక్కువ మంది నుంచి వస్తున్న ప్రశ్న.
ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో మొదటి మాటకే కట్టుబడి ఉంటే?
రేవంత్ రెడ్డి చేచేరికల కోసం కొన్నాళ్ల కిందట గేట్లు ఎత్తారు. తాము గేట్లు ఎత్తామని ప్రకటించిన వెంటనే పోలోమంటూ పెద్ద ఎత్తున నేతలు తరలి వస్తున్నారు. వారికి ఎంపీలు, ఎంపీ అభ్యర్థులే కాదు.. భవిష్యత్ లో పార్టీలో పదవులు లేదా ప్రభుత్వంలో నామినేటెడ్ ప దవులు.. ఇంకా ఆర్థిక ప్రయోజనాలు ఆశించి చేరే వారు కూడా ఉంటున్నారు. ఇలాంటి వారు పది మంది ఎమ్మెల్యేలు చేరారు. వీరిలో ఎవరూ కాంగ్రెస్ కు విధేయులు కాదు. పైగా బీఆర్ఎస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితులు కూడా. అయినా పార్టీలో చేర్చుకున్నారు. రేవంత్ మొదట్లో ఓ మాట చెప్పేవారు. తమ పార్టీ ఎల్పీల్ని రెండు సార్లు బీఆర్ఎస్ విలీనం చేసుకున్నా.. తమ పార్టీని బలహీనం చేయలేకపోయారని. కానీ ఆ మాటను తర్వాత రేవంత్ మర్చిపోయి మారిపోవడంతోనే సమస్య వస్తోంది.
వాళ్లెవరూ లేకుండానే గెలిచిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అండ్ టీం ఏటికి ఎదురీది గెలిచారు. ప్రస్తుతం పార్టీలో చేరిన వారంతా కాగ్రెస్ పార్టీని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డిన వాళ్లే. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని నమ్మిన వాళ్లే. ఇప్పుడు వారు రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తగానే పోలోమంటూ ఎందుకు వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఇలాంటి నేతలు కూడా కారణం. పార్టీ కోసం కష్టపడిన వారు ఉన్నారు. దశాబ్దం పాటు పార్టీ కోసం కష్టపడిన వారు.. అసలు పార్టీకి భవిష్యత్తే ఉండదన్న భావన వచ్చినప్పటికీ పార్టీని వదిలి పెట్టని వారు ఉన్నారు. వారిలో చాలా మంది గ్రామ, మండల స్థాయిలోనే ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ ఎప్పటికప్పుడు బలంగా ఉందన్న భావన రావడానికి లీడర్లు పోయినా క్యాడర్ పోలేదని అనుకోవడమే. ఇప్పుడు ఆ క్యాడర్ ను గుర్తించడం లేదన్నది ప్రధాన ఆరోపణ
వాళ్లెవరూ బీఆర్ఎస్‌ను గెలిపించలేదని గుర్తుంచుకుంటే చాలంటున్న క్యాడర్
చేరిన వారు .. చేరుతున్న వారు ఎవరూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించలేదు. ఆ కారు గుర్తు నేతలు ఎప్పుడూ ఆ పార్టీని గెలిపించలేదు. గెలిచి చూపించిన కాంగ్రెస్ పార్టీకి వారు చేసేదేమీ ఉండదు. కానీ.. బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయవచ్చు. ఈ వ్యూహంతో తమ కుంపటికి నిప్పుపెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. రేవంత్ రెడ్డి ఈ విషయంలో మారిపోవాలని ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఆయన మారిపోయారు. చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఆయన మారొద్దని క్యాడర్ కోరుకుంటున్నారు. మరి వింటారా ?