మన భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. దీన్ని సంపదగానే కాదు.. సెంటిమెంట్‌గా కూడా భావిస్తారు. ఇంట్లో బంగారం ఉండటాన్ని శుభంగా పరిగణిస్తారు. ఈ కాలంలో బంగారన్ని పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే, కొంచెం డబ్బు ఉన్నా సరే.. నగలు లేదా గోల్డ్ కాయిన్స్, బిస్కట్లను కొనుగోలు చేసి దాచి పెట్టుకుంటున్నారు. అయితే, ఎంతవరకు బంగారాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చనే విషయం చాలామందికి తెలియదు. అలాగే బంగారంపై ఉండే పన్నులు, నిబంధనలు వంటివి కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియనివారి కోసమే.. ఈ వివరాలు.
ఇండియాలో బంగారం కొనుగోలు, నిల్వ పన్ను నియమాలు ఇలా ఉన్నాయి
మన దేశంలో బంగారం కొనుగోలు, నిల్వ , పన్నులపై కొన్ని నియమాలు ఉన్నాయి. పరిమితిని మించి బంగారాన్ని నిల్వ చేయకుండా ఉండేదుకు ప్రభుత్వం ఈ నిబంధనలు విధించింది. అందుకే బంగారం కొనేప్పుడు కూడా కొన్ని నిబంధనలు పాటించాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బంగారం కొనుగోళ్లు, ఇంట్లో ఎంత బంగారం వరకు నిల్వ పెట్టుకోవచ్చనే విషయాలపై ప్రభుత్వం పరిమితులు విధించింది.
బంగారాన్ని ఇంట్లో నిల్వ ఉంచితే?
భారత ప్రభుత్వ ఆదాయ శాఖ (CBDT) ప్రకారం.. మీరు కొనుగోలు చేసే బంగారాన్ని ఎప్పుడు ఎలా ఏ విధంగా కొనుగోలు చేశారనే ఆధారాలు ఉండాలి. అవి లేకపోతే.. దాన్ని అక్రమ సంపాదనగా పరిగణిస్తారు. దానికి పన్ను కట్టకపోయినా నేరమే.
మహిళలు ఎంత బంగారం నిల్వ పెట్టుకోవచ్చు?
చట్ట ప్రకారం.. వివాహిత మహిళలు 500 గ్రాముల బంగారాన్ని ఇంట్లో నిల్వ పెట్టుకోవచ్చు. చైన్, నెక్లేస్, గాజులు, చెవి రింగులు, గాజుల రూపంలో బంగారు ఆభరణాలను దాచుకోవచ్చు. పెళ్లికాని మహిళలు 250 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఇంట్లో నిల్వ పెట్టుకోవాలి. పురుషులు 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఇంట్లో నిల్వ పెట్టుకోవాలి.
వారసత్వంగా లభించే బంగారంపై పన్ను ఉంటుందా?
మీరు బంగారాన్ని చట్టబద్ధంగా సంపాదించినట్లయితే.. అది పన్ను పరిధిలోకి రాదు. మీ కష్టార్జితంతో బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే దానికి పెద్దగా సమస్యలు ఉండవు. అలాగే బంగారాన్ని చట్టబద్ధంగా వారసత్వంగా పొందినట్లయితే.. దానిపై ఎలాంటి పన్ను ఉండదు. కాబట్టి నిరభ్యంతరంగా మీరు ఆ బంగారాన్ని మీతో ఉంచుకోవచ్చు.
ఇంట్లో బంగారం పెట్టుకుంటే పన్ను పడుతుందా?
ఇంట్లో బంగారం నిల్వ పెట్టుకుంటే ఎలాంటి పన్ను విధించరు. అంటే, మీరు ఇంట్లో బంగారం నిల్వ పెట్టుకుని ఉంటే, మీరు దానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, మీరు ఆ బంగారాన్ని విక్రయించాలనుకుంటే, ఆ లావాదేవీలపై పన్ను విధిస్తారు.
బంగారాన్ని అమ్మేప్పుడు పన్ను చెల్లించాల్సిందే
మీరు బంగారాన్ని 3 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే, ఆ లాభం లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్ (LTCG) పన్ను పరిధిలోకి వస్తుంది. ఈ పన్ను రేటు 20% ఉంటుంది. అంటే, మీరు 3 సంవత్సరాలు లేదా అంతకుమించి బంగారాన్ని దాచిన తర్వాత విక్రయించినట్లయితే, ఆ లాభంపై 20% పన్ను విధిస్తారు.
బంగారు బాండ్లపై పన్ను
బంగార బాండ్లు (SGB) పై పన్ను విధానం కూడా భిన్నంగా ఉంటుంది. మీరు 3 సంవత్సరాల లోపు బంగార బాండ్లు విక్రయిస్తే, ఆ లాభం వ్యక్తిగత ఆదాయంలోకి చేర్చుతారు. అయితే, 3 సంవత్సరాల తర్వాత విక్రయించినప్పుడు, ఆ లాభంపై 20% ఇండెక్సేషన్ పన్ను లేదా 10% ఇండెక్సేషన్ లేకుండా పన్ను విధిస్తారు.