Andhra BJP: ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. పార్టీ నేతల్ని పిలిచి హైకమాండ్ పెద్దలు మాట్లాడుతున్నారు. ఇటీవలి కాలంలో పార్టీ నేతలు కష్టపడిన వైనంపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్నందున సమీకరణాలు సరి చూసుకుంటున్నారు. ఎవరికి అవకాశం ఇవ్వాలి.. ఏ వర్గానికి ఇవ్వాలి అన్నదాని ఆధారంగా అధ్యక్ష పదవిని ఖరారు చేయనున్నారు. ఈ క్రమంలో ఇద్దరి పేర్లు ఫైనల్ స్టేజ్ కు వచ్చాయని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఒకటి సుజనా చౌదరి కాగా మరొక పేరు ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి.
పురందేశ్వరికి బాధ్యతల నుంచి విముక్తి
పురందేశ్వరి జాతీయరాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆమె పెద్దగా చేసిందేమీలేదు. ఏపీ బీజేపీఅధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆమె అంత యాక్టివ్ కాలేదు. అదే సమయంలో జాతీయ పార్టీ కోసం ఆమె సేవల్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆమెకు రాష్ట్ర బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని ..నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ దాదాపుగా చివరి దశగా వచ్చింది. నెలాఖరులోగా అన్ని పూర్తవుతాయి. అప్పటికి ఏపీ అధ్యక్షుడ్ని కూడా ఖరారు చేయనున్నారు.
గట్టిగా ప్రయత్నం చేస్తున్న సుజనా చౌదరి !
మరో వైపు మంత్రి పదవి ఆశించినా చాన్స్ లేకపోవడంతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కావాలని సుజనా చౌదరి పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. అలా అయితే ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించవచ్చని ఆయన చెబుతున్నారు. కూటమని స్ట్రాంగ్ గా ఉంచుతానని ఆయన అటున్నారు. అయితే ఆయన టీడీపీ నుంచి వచ్చిన లీడర్ కావడంతో ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీ బలపడుతుందా లేకపోతే మరింతగా టీడీపీకి అనుబంధంగా మారుతుందా అన్న సందేహాలు ఉన్నాయి. అందుకే ఈ విషయంలో వెనుకా ముందాడుతున్నట్లుగా తెలుస్తోంది.
విష్ణువర్ధన్ రెడ్డికి ఆరెస్సెస్ మద్దతు?
మరో వైపు రాయలసీమ ప్రాంతానికి అదీ రెడ్డి వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. రాయలసీమలో పార్టీకి మంచి బలం ఉందని దాన్ని కాపాడుకోవాలని అంటున్నారు. ఈ క్రమంలో విష్ణువర్దన్ రెడ్డి పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ఏబీవీపీ నుంచి పార్టీలో ఉండటంతో పార్టీ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో ఆయన కీలకం. పార్టీకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు అందుబాటులో ఉంటూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఆరెస్సెస్ కూడా ఆయనకు సపోర్టు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో సుజనా లేదా విష్ణు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి పేర్లు ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.