ఎక్కువ గంటల పని విధానం కార్పొరేట్ విషవలయం – వర్క్‌ ట్రాన్స్‌లోకి జనాలను తీసుకెళ్తున్న కంపెనీలు!

The 90-hour work week

దేశం కోసం… ధర్మం కోసం… అంటు ఇప్పటి వరకు రాజకీయాలే నడిచాయి. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు కూడా అదే బాట పడుతున్నాయి. మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా పని చేయాలంటే మరింత కష్టపడాలనే వాదనను బలంగా ప్రజల మైండ్‌లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ దేశంలో ఇన్ని గంటలు కష్టపడుతున్నారు. ఈ దేశంలో ఇన్ని గంటలు కష్టపడుతున్నారనే ప్రచారం చేస్తున్నారు. నారాయణ మూర్తి, ఎస్ఎన్ సుబ్రమణియన్ ఎవరు ఎలా చెప్పినా విషయం మాత్రం ఒకటే. ఎక్కువ సమయం పని చేయండి. దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లండి.

కార్పొరేట్‌ ప్రజలను, పని చేసే ఉద్యోగులను ఎలా మైండ్ డైవర్ట్ చేస్తుందో ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఇంట్లో మాత్రమే డబ్బులు దాచుకునే వాళ్లు. ప్రైవేటు బ్యాంకు వ్యవస్థ రావడంతో డబ్బులు బ్యాంకుల్లో దాయడం మొదలు పెట్టే వాళ్లు. ఇంట్లో డబ్బులు దాచుకున్నప్పుడు, చేతికి నగదు రూపంలో జీతాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ప్రైవేటు బ్యాంకు వ్యవస్థ వచ్చినప్పటి నుంచి చాలా ప్రైవేటు సంస్థలు బ్యాంకుల్లోనే నేరుగా డబ్బులు జమ చేయడం మొదలు పెట్టాయి. దీంతో ఎవరి సంపాదన ఏంటీ అన్నదానిపై ప్రభుత్వ నిఘా పెట్టింది. క్రమంగా ఐటీ కట్టే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది.

ఏ ప్రభుత్వమైనా, ప్రైవేటు సంస్థ అయినా ఖర్చు పెట్టే వాళ్లు ఉంటేనే సాఫీగా వ్యాపారం సాగుతుంది. లేకుంటే ఎంత పెద్ద సంస్థ అయినా మూసుకోవాల్సింది. అందుకే వినియోగదారుడి సౌలభ్యం కోసం అని చెప్పి కార్డు సిస్టమ్ వచ్చింది. ఏటీఎంలు వచ్చాయి. దీంతో నగదు చెలామణి పెరుగుతూ వచ్చింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది క్రెడిట్ కార్డులు, ఈఎంఐ కార్డులు. అప్పటి వరకు తమ వద్ద ఉన్న డబ్బులను పొదుపుగా వాడుకుంటూ వస్తువులు కొనుక్కునే వాళ్లంతా ముందు అప్పులు చేసి కొనడం తర్వాత నెల నెలా కట్టుకోవడం మొదలు పెట్టారు.

ఇలా నెల నెలా కట్టుకోవడం ఈజీయే కదా అని చాలా మందికి అనిపించ వచ్చు కానీ ఇలా ఒక వ్యక్తి తన శాలరీలో 50 శాతం ఈఎంఐ పెట్టుకుంటే ఆయన ఏదైనా కారణంతో ఉద్యోగం వదులుకోవాలన్నా మరేదైనా పని చేసుకోవాలన్నా భయపడే పరిస్థితికి వచ్చేస్తాడు. కచ్చితంగా జాబ్ చేయాల్సిన స్థితికి చేరుకుంటాడు. ఇలా దీన్నో విషవలయంగా మార్చేసాయి ఈ కార్పొరేట్ కంపెనీలు. ఒకసారి ప్రైవేటు ఉద్యోగంలో చేరిన వారంతా ఈ కూపం నుంచి బయటపడే మార్గాలు లేకపోవడంతో ఆదాయం పెంచుకునేందుకు కొందరు అదనపు గంటలు పని చేస్తుంటే మరికొందరు వక్రమార్గం పడుతున్నారు. ఇంకొందరు ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు.

ఇప్పుడు పని విషయంలో అదే జరుగుతోంది. ఇంత వరకు భారతీయ వ్యవస్థలో కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. అలాంటివి పట్టించుకోకుండా మీరు నిత్యం చేస్తూ ఉండాలంటూ చెప్పడం కూడా కుటుంబ వ్యవస్థపై గొడ్డలిపెట్టుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే వారంలో రెండు రోజుల వికాఫ్ అని చెప్పి 9 గంటల కంటే ఎక్కువ సమయం పని చేయిస్తున్నాయి కంపెనీలు. టార్గెట్‌ల పేరుతో నిత్యం మైండ్‌లో వర్క్ కల్చర్‌ను నింపుతున్నాయి.

ఇంకా ఆదివారం కూడా పని చేయాలి 90 గంటలు పని చేయాలనే సంస్కృతిని తీసుకొచ్చి జనాలు నిత్యం పనిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు. ఇప్పటికే భారత దేశంలో ఎక్కువ మ్యాన్ పవర్ ఉంది. మన కార్పొరేట్ కంపెనీలు ప్రపంచాన్ని శాసించాలంటే కచ్చితంగా ఈ మ్యాన్‌పవర్ అవసరం ఉంది.

అందుకే దీన్ని వీలైనంత వాడుకోవాలని అటు ప్రభుత్వాలు, ఇటు కార్పొరేట్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ 90 గంటల పని అనే కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నాయి. విదేశాల్లో చెప్పిన సమయాని కంటే ఒక్క సెకను కూడా పని చేయడానికి ఎవరూ ముందుకు రారు. మన భారతీయ కల్చర్‌లో అది ఉండదు. అప్పగించిన పనిని పూర్తి డెడికేషన్‌తో చేస్తారు. అందుకే ఇండియన్ మ్యాన్‌పవర్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. అలాంటి మ్యాన్‌పవర్‌ను శక్తి కొద్ది వాడుకోవాలే తప్ప అంతకు మించి ఆశిస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది.

తరవాత కథనం