Vijaya Sai Reddy: 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కకావికలమైపోతోంది. అసలు ఎవరు పార్టీలో ఉన్నారో ఎవరు ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వైసీపీ అధినేత జగన్‌కు సన్నిహితులు అని పేరు మోసిన వాళ్లే పార్టీకి గుడ్‌బై చెప్పేసి ఉండలేమంటూ వీడుకోలు అంటు వెళ్లిపోతున్నారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని నేతలు వీడుతుంటే కేడర్ మొత్తం డైలమాలో పడిపోతోంది. మరికొందరు అసలు పార్టీలో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి నెలకొంది.
చాలా మంది వైసీపీ నేతలు జగన్‌కు గుడ్‌బై చెప్పేసి వెళ్లిపోయారు. వాళ్లంతా ఒక లెక్క అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్లు కూడా పార్టీని వీడటం అందర్నీ షాక్‌కి గురి చేసింది. దీనిపై ఎలా రియాక్ట్ కావాలో కూడా ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. దశాబ్ధాలుగా జగన్‌తో కలిసిమెలిసి తిరిగారు. ఆయనతో జైలు కూడు తిన్నారు. కేసుల్లో విచారణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేశారు. అలాంటి వ్యక్తి పార్టీని వీడటం అంతు చిక్కని ప్రశ్నలా మారిపోయింది.
జగన్‌కు సమీప బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియా ముఖంగా వైసీపీపై చాలా విమర్శలు చేసినప్పటికీ విజయ సాయిరెడ్డి మాత్రం ఆ పని చేయలేదు. తన వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టు ప్రకటించారు. వైసీపీకి రాజీనామా చేసిన తాను శనివారం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. ఎవరితోనైనా రాజకీయ శతృత్వం మిత్రుత్వమే ఉంటుందని వ్యక్తిగతంగా అందరితో సన్నిహత సంబంధాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో వ్యవసాయం చేసుకుంటానంటూ ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశారు.
విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇదే” రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీలోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా.
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా.
దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు
టీడీపీతో రాజకీయంగా విభేదించా, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అంటు ముగించారు.
వైసీపీలో చాలా కాలంగా ఉన్న విభేదాలు కారణంగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారనే టాక్ నడుస్తోంది. అధికారంలోకి వచ్చే వరకు నెంబర్ టూగా ఉన్న ఆయన హావాకు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి గండి కొట్టారని అంటారు. వాళ్ల పలుకుబడి పెరిగిన తర్వాత విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గిందని అందుకే ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి అప్పట్లో తప్పించారని అంటారు. ఈ బాధ్యతలను మొన్నీ మధ్యే అప్పగించారు.
ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ఉన్న టైంలో విజయసాయిరెడ్డి తన కోటరీని ఏర్పాటు చేసుకున్నారని దీని వల్ల మొదటి నుంచి వైసీపీని నమ్ముకున్న నేతలు ఇబ్బంది పడ్డారనే విమర్శ ఉంది. ఈ విషయంలో తరచూ జగన్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో విజయసాయిరెడ్డి అధికారాలకు కత్తెర వేశారని అంటారు. వ్యక్తిగతంగా ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం జగన్‌కు నచ్చలేదని సమాచారం.
ఢిల్లీలో విజయసాయిరెడ్డికి ఉన్న పలుకుబడి కూడా జగన్ ఇగోను హర్ట్ చేసిందని అంటారు. పార్టీ, జగన్ కంటే మిన్నగా బీజేపీ నేతలతో విజయసాయిరెడ్డికి సంబంధాలు ఉన్నాయి. ఎవరి అపాయింట్మెంట్ కావాలన్నా ఆయన్నే సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంతోనే ఆయనకు రెండోసారి ఎంపీ పదవి కూడా వరించింది. కానీ ఇవేవీ జగన్‌కు ఇష్టం లేదని అంటారు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రోత్సహించారని గుసగుసలు వినిపిచేవి.
అధికారంలో కోల్పోయిన తర్వాత విజయసాయిరెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళా అధికారి కుటుంబంలో చిచ్చురేపారని, విశాఖలో తన కూతురు పేరిట కబ్జాలు చేశారని, కాకినాడలో దందాలు చేశారని అంటారు. వీటన్నింటిపై విచారణలు సాగుతున్నాయి. ఈ వివాదాల్లో పార్టీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదట. వ్యక్తిగతంగా తనకు ఎలాంటి లాభం లేకపోయినా జగన్‌తో ఉన్నందుకు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. తను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా స్పందించకపోవడంతో విజయ సాయిరెడ్డి చాలా ఫీల్ అయినట్టు చెబుతున్నారు. తాను పార్టీలో ఉండలేకపోతున్నానని అలాగనే వేరే పార్టీలోకి కూడా వెళ్లే స్థితి లేదని అంటారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు సన్నిహితులు చెబుతున్నారు.
విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన పది పదిహేను నిమిషాలకే వైసీపీ మోర కీలక నేత అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన ఖండించినప్పటికీ క్యూలో చాలా మంది నేతలు ఉన్నారనే టాక్ గట్టిగా నడుస్తోంది. ఇలా జగన్‌కు అత్యంత సన్నిహింతగా మెలిగే నేతలే గుడ్‌బై చెప్పడంతో పార్టీ భవిష్యత్ ఏంటనే సందిగ్ధం మొదలైంది.