Mamatha Kulakarni : అద్భుతమైన నటనతో, సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో అభిమానుల మనసు గెలుచుకున్న నటి మమతా కులకర్ణి మరో పాత్రలోకి ప్రవేశించారు. తన ప్రాపంచిక జీవితం నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. మహాకుంభమేళాలో కొత్త పాత్రలోకి ప్రవేశించారు. కిన్నార్ అఖారాలో సన్యాసం తీసుకున్నారు. ఈ తంతు చాలా సంప్రదాయబద్ధంగా సాగింది.
మమతా కులకర్ణి తన పేరను శ్రీ యమై మమతానంద్ గిరిగా మార్చుకున్నారు. కిన్నార్ అఖారా ఈ మహామండలేశ్వర బిరుదును మమతా కులకర్ణికి ఇచ్చారు. ఈ అఖారా 2015 సంవత్సరంలో ఏర్పడింది. ఇది సనాతన ధర్మంలోని 13 ప్రధాన అఖారాలకు భిన్నంగా ఉంటుంది. ఈ అఖారాలోని ‘ఆచార్య మహామండలేశ్వరుడు’ లక్ష్మీనారాయణ త్రిపాఠి.
అఖారా సంప్రదాయం ప్రకారం, మమతా కులకర్ణికి మొదట కాషాయ వస్త్రాలు ధరింపుజేశారు. ఆపై పూలమాల వేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య తిలకం దిద్దారు. పసుపు పూశారు. మమతకు పాలతో స్నానం చేయించారు. ఈ సమయంలో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
మమతా కులకర్ణి మొదట శుక్రవారం లక్ష్మీనారాయణ త్రిపాఠిని కలిశారు. తాను సన్యాసం తీసుకబోతున్నట్టు వివరించారు. తర్వాత ఆమెకు మహామండలేశ్వర్ బిరుదును ఇస్తానని కిన్నార్ అఖారా ప్రకటించింది. ఒక సంస్థ, కంపెనీ లేదా ప్రభుత్వంలో ఉన్నట్టే ఇక్కడ కూడా వివిధ పదవులు ఉంటాయి. సన్యాసులు అఖారాలను నడపడానికి ఒక బిరుదు కేటాయిస్తారు. వీటిలో శంకరాచార్యునిది పెద్ద స్థానం, రెండో స్థానం మహామండలేశ్వరుడిది.
మహామండలేశ్వరుడిగా మారే ప్రక్రియ
మహామండలేశ్వరుడు కావాలంటే, ముందుగా ఒక వ్యక్తి తనకు తాను పిండ ప్రదానం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ వ్యక్తికి పట్టాభిషేకం చేస్తారు. మహామండలేశ్వర్‌గా మారడానికి మమతా కులకర్ణి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. తర్వాత ఆమె తనకు తాను పిండ ప్రదానం చేసుకున్నారు. అనంతరం మమతా కులకర్ణి ఆనే గుర్తింపును శాశ్వతంగా విడిచిపెడుతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఆమెను మమతా కులకర్ణి అని పిలవడానికి బదులు శ్రీ యమై మమతా నంద్ గిరి అని పిలుస్తారు. కిన్నార్ అఖారా మహామండలేశ్వరిగా గుర్తిస్తారు.
మమత హఠాత్తుగా మహామండలేశ్వర్‌గా ఎలా మారింది?
మమతా కులకర్ణి అకస్మాత్తుగా మహామండలేశ్వర్‌గా ఎలా మారిందని చాలా మందికి వస్తున్న అనుమానం. ఎందుకంటే మహామండలేశ్వర్‌గా మారాలంటే మొదట దీక్ష చేసి చాలా కాలం తపస్సు చేసి ప్రాపంచిక జీవితానికి అలవాటు పడాలి. మహామండలేశ్వరిగా మారే వ్యక్తి సన్యాసి అయి ఉండాలని అఖారాల నియమం. ప్రాపంచిక అనుబంధాల కోసం త్యాగం చేయాలనే భావన ఉండాలి. కుటుంబ సంబంధాలకు దూరంగా ఉండాలి. వేదాలు, పురాణాల గురించి తెలుసుకోవాలి. కానీ మమతా కులకర్ణి జీవితం వివాదాలతో నిండి ఉంది.
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ వారెంట్
2013లో మమతా కులకర్ణి హిందీ చిత్ర పరిశ్రమను విడిచిపెట్టారు. అప్పట్లో డ్రగ్స్ మాఫియా విక్కీ గోస్వామిని దుబాయ్‌లో వివాహం చేసుకున్నారని ప్రచారం సాగింది. దుబాయ్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్‌లో 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన డ్రగ్ మాఫియా ఇదేనని ఆరోపించారు. మమతా కులకర్ణి ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ 2016 సంవత్సరంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.ఆమె ముంబై నుంచి 80 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు
మమతా కులకర్ణి స్వయంగా డ్రగ్స్ మాఫియా విక్కీ గోస్వామితో ప్రేమలో ఉన్నారని, 2000 సంవత్సరం నుంచి 2024 వరకు భారతదేశానికి దూరంగా ఉండిపోయారనే విమర్శ ఉంది. మమతా కులకర్ణి చిత్ర పరిశ్రమను విడిచిపెట్టనప్పుడు అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఓ సినిమా కోసం అండర్ వరల్డ్ నేరస్తులు దర్శకుడిని పిలిచేలా చేశారని కూడా అంటారు.
టాప్‌లెస్ ఫోటోషూట్‌పై దుమారం
1993 సంవత్సరంలో ఆమె ఒక మ్యాగజైన్ కోసం టాప్‌లెస్ ఫోటోషూట్ చేశారు. ఇది అప్పట్లో పెను దుమారమే రేపింది. ఇన్ని వివాదాలు ఉన్న మమతా కులకర్ణి మహామండలేశ్వర్‌గా మారడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు ఆ అవకాశం కిన్నార్ అఖారాను ఎందుకు ఇచ్చారనే ప్రశ్న అందరిలో ఉంది.