SSMB29: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సినిమా వాళ్లకు కొత్త కష్టాలు వస్తున్నాయి. ఒకప్పుడు మూవీ థియేటర్‌కు వచ్చిన తర్వాత లీకులు బెడద ఉండేది. కానీ ఇప్పుడు షూటింగ్ స్పాట్ నుంచే అప్‌డేట్స్ ఇచ్చేస్తున్నారు. దీని వల్ల ఆ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగ్ నుంచి రిలీజ్ వరకు పసిపాప కంటే జాగ్రత్తగా ప్రోడక్ట్‌ను చూసుకోవాల్సి ఉంటుంది.
ఇలాంటి లీకుల సమస్యలను ఇప్పటికే ఎదుర్కొన్న ఎస్‌ఎస్ రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నారు. మహేష్‌బాబు కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న #SSMB29 కోసం పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూటింగ్ స్పాట్‌ను ఓ మినీ బిగ్‌బాస్ హౌస్‌లా మార్చేశారట. షూటింగ్‌కు వెళ్లే ముందు మహేష్‌బాబు, రాజమౌళితోపాటు ప్రతి ఒక్కరు కూడా సెల్‌ఫోన్‌లను డిపాజిట్ చేయాలట. తర్వాత వారిని పూర్తిగా చెక్ చేసి సెట్ లోపలికి పంపిస్తారు.
ఇప్పటికే #SSMB29లో మహేష్‌బాబుతో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా వెల్లడైంది. ఈ రెండు పాత్రలు తప్ప వేరే పాత్రలు లీకు కాకుండా ఉండేందుకు మహేష్‌బాబు సినిమా లుక్ బయటు రాకుండా జక్కన్న అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్క అప్‌డేట్ లీకు అయినా దాన్ని గుర్తించేందుకు ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఎవరు లీకు చేశారో ఇట్టే తెలిసేలా చర్యలు చేపట్టారట.
#SSMB29 కోసం పని చేసే ప్రతి ఒక్కరు కూడా నాన్-డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ అంటే NDAపై సంతకాలు చేయాలట. ఈ ఒప్పందం ప్రకారం ఏ విషయం కూడా బయటకు చెప్పడానికి వీలు లేదు. దర్శక-నిర్మాతల అనుమతి లేకుండా సమాచారం లీకు చేస్తే భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా లీకు అయితే ఎవరు లీకు చేశారో అన్న విషయం తెలిసిపోతుందట.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. హైదరాబాద్ పరిసరాల్లోనే మరో రెండు మూడు ప్రాంతాల్లో ప్రత్యేక సెట్‌లు వేసినట్టు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో ఓ యాక్షన్ అడ్వెంచర్ జోనర్‌లో తీస్తున్న సినిమా కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పాస్‌పోర్ట్‌ను కూడా రాజమౌళి లాక్కున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. రాజమౌళి చేసిన పోస్టుకు మీమ్స్, ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియా దద్దరిల్లుతోంది. అవి వైరల్‌గా మారుతున్నాయి. నాలుగైదు రోజులుగా ఆ వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.
ట్రిపుల్ ఆర్ తర్వాత దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రాజమౌళిపేరు మారుమోగిపోతోంది. అందుకే అంత్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అంతర్జాతీయ నటీనటులను కూడా తీసుకువస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాజమౌళి సోషల్ మీడియా పోస్టు తప్ప వేరే ఏ విషయం కూడా మీడియా ముఖంగా చెప్పలేదు.ఎప్పుడూ సినిమా ప్రారంభానికి ముందు ప్రెస్‌మీట్ పెట్టే రాజమౌళి ఈసారి ఎందుకు పెట్టలేదనే చర్చ నడుస్తోంది.
ట్రిపుల్ ఆర్ సమయంలో కూడా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో కలిసి ఉన్న ఫొటోను రాజమౌళిక షేర్ చేశారు. అక్కడి కొన్నిరోజుల తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి పేరు, మిగతా వివరాలు వెల్లడించారు. ఈ సినిమా విషయంలో అలాంటి ప్రకటన ఏదైనా ఉంటుందా అని సినిమా ప్రియులు ఎదురు చూస్తున్నారు.