తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు గా జరపాలని నిర్ణయించింది. ఆ రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు, నటీనటులకు ఛాంబర్ తరపున అవార్డులు ఇవ్వాలని పేర్కొంది.
అయితే ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీనే ఇవ్వాలని నిర్ణయించింది. ఆ రోజున సినిమా పరిశ్రమలోనే ప్రతి నటీనటుడు తమ ఇంటిపై జెండా ఎగురవేయాలని తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న థియేటర్లన్నింటిపైన జెండా ఎగురువేయాలని పేర్కొంది.
ఈ జెండా రూపకల్పన బాధ్యతను ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్లు ఫిలిం ఛాంబర్ వెల్లడించింది. ఈ మేరకు టిఎఫ్ సిసి హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పర్చూరు గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు.
అనంతరం సీనియర్ నటుడు నిర్మాత మురళీమోహన్ మాట్లాడారు ఫిబ్రవరి ఆరవ తేదీన తెలుగు సినిమా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఇకపై ఆ రోజున ఫిల్మ్ ఛాంబర్ తరపున అవార్డులు అందివ్వాలి అన్నది ఒక మంచి ఆలోచన అని ఆయన పేర్కొన్నారు.
సినిమా పరిశ్రమలోని అన్ని విభాగాల వాళ్ళు యూనిటీగా ఉండి దీనిని నిర్వహిస్తే ఇంకా బాగుంటుందని ఆయన అన్నారు. ఎంతోమంది నిర్మాతల కృషి వల్లే ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నామని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించుకుందామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, దామోదర ప్రసాద్, అనుపమ రెడ్డి, మదాల రవి, ముత్యాల రాందాస్, ఆచంట గోపీనాథ్ సహా తదితరులు పాల్గొన్నారు