ఆరోగ్యంగా ఉండాలంటే తరచుగా పండ్లు తినాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. కానీ చాలా మంది పండ్లు తినడానికి బదులుగా.. పండ్లను జ్యూస్ రూపంలో తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మరోవైపు ఆరోగ్య నిపుణులు సైతం పండ్లను ఎక్కువగా తినాలని సూచిస్తూ ఉంటారు. అయితే ఇప్పటికీ చాలా మందికి పండ్లు తినడానికి, పండ్లను జ్యూస్ రూపంలో తీసుకోవడానికి గల తేడా తెలీదు. అందువల్ల ఈ రెండింటి మధ్య తేడాను ఇప్పుడు తెలుసుకుందాం. దీనిపై ఓ ఆరోగ్య నిపుణుడు మాట్లాడుతూ.. పండ్లు, వాటి రసం రెండూ స్వంత ప్రయోజనాలను కలిగి ఉన్నాయని అన్నాడు. అయితే పండ్లు మరింత ఆరోగ్యకరమైనవని ఆయన చెప్పారు.
ఫైబర్
పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని.. ఇది జీర్ణవ్యవస్థకు, రక్తంలో చక్కెరకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణుడు చెప్పారు. పండ్లు తిన్నప్పుడు మనకు ఈ ఫైబర్ లభిస్తుంది. అయితే మనం జ్యూస్ తాగినప్పుడు ఫైబర్ అదృశ్యమవుతుంది అని చెప్పుకొచ్చారు.
జ్యూస్‌లో తక్కువ బలం
పండ్లలో ఫైబర్ మాత్రమే కాకుండా, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. ఈ మూలకాలన్నీ మన ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయి. అంతేకాకుండా అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. అదే సమయంలో జ్యూస్‌లో ఈ పోషకాలన్నీ ఉంటాయి. కానీ ఫైబర్ లేకపోవడం వల్ల దాని ప్రభావం తగ్గుతుంది.
బరువు తగ్గడంలో పండ్ల మేలు
జ్యూస్‌ల కంటే బరువు తగ్గడంలో పండ్లు ఎక్కువగా సహాయపడతాయి. ఈ పండ్లు తినడం వల్ల కడుపు నిండుతుంది. దీని వల్ల మనం అతిగా తినకుండా ఉండగలం. అదే సమయంలో జ్యూస్ తాగడం వల్ల వచ్చే సమస్య.. త్వరగా ఎక్కువ కేలరీలు తీసుకుంటాం. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది అని తెలిపారు.
ప్యాక్ చేసిన జ్యూస్
మార్కెట్‌లో లభించే జ్యూస్‌లలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుందని ఆయన చెప్పారు. ఈ జ్యూస్‌లు హానికరమైన ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటాయని.. ఇవి ఆరోగ్యానికి హానికరమని అన్నారు. అందువల్ల ప్యాక్డ్ జ్యూస్‌లకు దూరంగా ఉండటం మంచిదని హెచ్చరించారు.
డీహైడ్రేషన్‌లో ఏం చేయాలి?
డీహైడ్రేషన్ సమస్య ఉన్నప్పుడు పండ్లు, జ్యూస్‌లు రెండింటినీ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణుడు తెలిపారు. ఈ పరిస్థితిలో జ్యూస్ శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. కానీ ఫైబర్ లేకపోవడం వల్ల అది తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి సమయాల్లో పండ్లు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని అన్నారు.
గమనిక: ఈ వార్త మీకు తెలియడం కోసం మాత్రమే రాయబడింది. ఏదైనా ఇతర సమాచారం కోసం సమీప వైద్యుని సలహాలు తీసుకోవాలి.