ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దశకు చేరుకుంది. పాకిస్తాన్ ఆతిథ్యంలో గత నెల ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభమైంది. ఈ ట్రోఫీ మార్చ్ 9న ముగియనుంది. ఇప్పటికే ఈ ట్రోఫీలో పాల్గొన్న జట్లు ఓడిపోయి ఇంటి బాట పట్టాయి. ఫైనల్ కు భారత్, న్యూజిలాండ్ చేరుకున్నాయి. ఈ రెండు జట్లకు ఆదివారం అంటే మార్చి 9న రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్లు దృఢమైనవి కావడంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. ఎప్పుడెప్పుడు ఈ మ్యాచ్ చూస్తామా అని క్రికెట్ అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. ఆరోజు రావడానికి మరో రెండు రోజులే సమయం ఉంది. ఆ రోజున క్రికెట్ ప్రియులందరూ టీవీల ముందు అతుక్కుపోతారు.
ఇంకొందరు స్మార్ట్ ఫోన్లలో మునిగి తేలిపోతారు. మరికొందరైతే తమ ఏరియాలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి మ్యాచ్ను ఆస్వాదిస్తారు. అయితే అలాంటివారు ఇప్పుడు థియేటర్లలో కూడా లైవ్ మ్యాచ్ ఆస్వాదించవచ్చు. అవును మీరు విన్నది నిజమే. క్రికెట్ అభిమానులకు మల్టీప్లెక్స్ లు అదిరిపోయే శుభవార్త చెప్పాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ను థియేటర్లలో వీక్షించవచ్చని వెల్లడించాయి. దీనికి టికెట్ రేట్లను కూడా ప్రకటించాయి. ఆసక్తిగల అభిమానులు ఈ లైవ్ మ్యాచ్ కు సంబంధించి టికెట్ బుకింగ్ చేసుకొని లైవ్ లో మంచి అనుభూతిని పొందవచ్చు.
తాజాగా ఈ మ్యాచ్ కోసం టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. అందువల్ల వెంటనే ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయం కేవలం అభిమానుల కోసమే తీసుకొచ్చామని థియేటర్ యాజమాన్యం తెలిపింది.