Health Benefits of Amla: ప్రతిరోజు ఉసిరి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉసిరిని జుట్టు పెరుగుదలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అది జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. ఇందులో విటిమిన్ సి తో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. 100 గ్రాముల ఉసిరిలో 80 శాతం నీరు, కొద్ది పాళ్లలో ప్రొటీన్లు, పిండి పదార్ధాలు, పీచు లభిస్తాయి. ఉసిరిలో 478 మి.గ్రా సి విటమిన్ లభ్యమవుతుంది.
ప్రతిరోజు ఉసిరిని తీసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది సంవత్సరం పొడవునా లభ్యం కాదు కాబట్టి పొడి లేదా.. పచ్చడి రూపంలో భద్రపరుచుకోవచ్చు. ఇందులో అధిక ఫైబర్ జీర్ణక్రియలో సమస్యలు రాకుండా చేస్తుంది. ఉదర సంబంధ ఇబ్బందుల్ని తొలగిస్తుంది. ఉసిరి కంటి చూపు, మొదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయ సమస్యలకు కూడా చక్కటి ఔషదంలా పనిచేస్తుంది.
ఉసిరి ఆరోగ్యానికే కాదు.. అందానికి రక్షగా నిలుస్తోంది. ఉసిరికాయ రసం చర్మాన్ని బిగుతుగా పట్టి ఉంచే కొల్లాజెన్‌ను ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో ముడతల పడటం తగ్గుతుంది. అంతేకాదు విషతుల్య నివారిణిగా పనిచేస్తుంది. చర్మం మీద ఏర్పడే నల్ల మచ్చలను, నలుపును కూడా తొలగిస్తుంది. మొటిమలు రాకుండా నివారిస్తుంది. తలకు రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టు, ఆరోగ్యంగా ఒత్తుగా పెరిగేందుకు ఉసిరి దోహదపడుతుంది. చుండ్రును దూరం చేస్తుంది.
ఉసిరి గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెకు సంబంధించిన రుగ్మతల నుంచి రక్షణ కలిగించడంలో అద్బుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇది సహజమైన మార్గంగా ఉపయోగపడుతుంది. అంతే కాదు కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలో విషపదార్ధాలను బయటకు పంపేందుకు సహాయపడుతుంది. డయాబెటిస్ తో బాధపడేవాళ్లు ప్రతిరోజు ఒక ఉసిరికాయను తింటే.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.