Bollywood: పాన్‌ మసాలా యాడ్‌తో బాలీవుడ్ హీరోలకు చిక్కులు

Bollywood: ఓ పాన్‌ మసాలా యాడ్‌.. ముగ్గురు ప్రముఖ బాలీవుడ్‌ హీరోలకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ యాడ్‌లో నటించి, దాన్ని ప్రమోట్‌ చేయడంపై వివరణ ఇవ్వాలని.. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు జైపూర్‌లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నోటీసులిచ్చింది. వారితో పాటు ఆ పాన్‌ మసాలా తయారు చేసే JB ఇండస్ట్రీస్ చైర్మన్ విమల్‌కుమార్ అగర్వాల్‌కు కూడా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. 30 రోజుల్లోగా అందరూ స్పందన తెలియజేయాలని, నలుగురూ మార్చి 19న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని, లేదా ప్రతినిధినైనా పంపాలని.. లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

షారుఖ్‌, అజయ్‌దేవగన్‌, టైగర్‌ష్రాఫ్‌లు ఓ పాన్‌ మసాలా యాడ్‌లో నటించి వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని… జైపూర్‌కు చెందిన న్యాయవాది యోగేంద్ర సింగ్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పాన్‌ మసాలాలోని ప్రతీ గింజలో కుంకుమ పువ్వు ఉందనే తప్పుడు ప్రచారం కారణంగా వినియోగదారులు పాన్‌ మసాలాను భారీగా వినియోగిస్తున్నారని, దీంతో JB ఇండస్ట్రీస్ కోట్ల రూపాయలు సంపాదిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిజానికి ఆ పాన్‌ మసాలాలో కుంకుమపువ్వు గానీ, అలాంటి మరే పదార్థం గానీ లేదని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. మార్కెట్లో కిలో కుంకుమపువ్వు ధర 4 లక్షల రూపాయల దాకా ఉందని.. దాన్ని 5 రూపాయల పాన్‌ మసాలాలో కలిపే అవకాశమే లేదని అన్నారు. పాన్‌ మసాలా ఆరోగ్యానికి హానికరమని, దీని వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగాలు వస్తాయని కమిషన్‌ ముందు ప్రస్తావించారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలకు ఆరోగ్య, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్న కంపెనీపైనా, దాన్ని ప్రమోట్ చేస్తున్న నటులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది యోగేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పాన్‌ మసాలాను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం