సాధారణంగా చాలామందిలో నోటి పూతలు కనిపిస్తాయి. అయితే వాటిని పెద్దగా లెక్కచేయరు. ఇవి ఎప్పుడు వచ్చేవే అంటూ నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడంవల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నోట్లో బొబ్బలు వస్తే అది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతమని హెచ్చరిస్తున్నారు.
ఈ నోటి పూత వల్ల సరిగా అన్నం కూడా తినలేరు. కనీసం నీళ్లు కూడా తాగడానికి ఎంతో కష్టపడతారు. కొన్నిసార్లు పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుంది. ఇవి తరచూ వస్తే మాత్రం వైద్యుడ్ని సంప్రదించాలి. కొన్నిసార్లు నోట్లో, మరి కొన్నిసార్లు నాలుక పై ఈ బొబ్బలు కనిపిస్తాయి. అందువల్ల ఇవి తరచుగా వస్తుంటే మాత్రం లేట్ చేయవద్దు.
ఎందుకంటే అది మన బాడీలో పెద్ద సమస్యను సూచిస్తుంది. ఇవి ముఖ్యంగా బాడీలో కొన్ని లోపాల కారణంగా ఏర్పడతాయి. విటమిన్ బి12, ఫోలికి యాసిడ్, ఐరన్ లోపం కారణంగా బొబ్బలు ఏర్పడతాయి. అదే సమయంలో కడుపులో వేడి, మల బద్ధకం వంటి సమస్యల కారణంగా నోటిపూతలు వస్తాయి. అలాంటి సందర్భంలో వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
ఎక్కువగా కారం తిన్నా, ధూమపానం, మద్యపానం, వేయించిన పదార్ధాలు తినడం వల్ల కూడా నోటిపూత వస్తుంది. శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. దానివల్ల బొబ్బలు తరచుగా వస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఇవి నోటి ఇన్ఫెక్షన్లు, నోటిపూతకు దారి తీస్తాయి.
అయితే చాలా కాలంగా నోటి పూత తగ్గకుండా ఉంటే అది క్యాన్సర్కు సంకేతం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల నోటిపూతను నివారించడానికి ప్రతిరోజు శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. మసాలా ఫుడ్ కు దూరంగా ఉండాలి. మద్యపానం, దుమపానం తగ్గించాలి. శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి.