Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు వెల్లడించారు.
తాజాగా విజయవాడ కనక దుర్గమ్మను రాబిన్ హుడ్ చిత్ర బృందం దర్శించుకుంది. ఆలయానికి వచ్చిన హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్‌కు దేవస్థానం అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని వారికి అందించారు. రాబిన్ హుడ్ సినిమా విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు హీరో నితిన్ తెలిపారు.
ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. ఈనెల 28న విడుదల కానున్న రాబిన్ హుడ్ మూవీని ప్రేక్షకులు ఆశీర్వదించాలని నితిన్ కోరారు. ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చేలా అన్ని అంశాలను జోడించామని తెలిపారు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారని తెలిపారు. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది.