Bayya Sunny Yadav: బెట్టింగులపై ఉక్కుపాదం.! బయ్యా సన్నీ యాదవ్‌ దొరికితే అరెస్ట్

Bayya Sunny Yadav

Bayya Sunny Yadav: డబ్బు సంపాదనే యూట్యూబర్ల లక్ష్యమా? దాని కోసం ఏం చేయడానికైనా వెనుకాడరా? ఆఖరికి జనం ప్రాణాలతోనూ చెలగాటమాడతారా? తమ వల్ల ఎంతమంది చనిపోయినా వాళ్లకు పట్టదా? ఇవే అనుమానాలు వస్తున్నాయి. యూట్యూబర్ సన్నీ యాదవ్ మాటలు వింటే. తన వీడియోలకు వ్యూస్ రావడం లేదని, దాని వల్ల ఆదాయం పడిపోయిందని… అందుకే బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయడం తప్ప తనకు మరో మార్గం లేదని నిస్సిగ్గుగా చెబుతున్నాడు… సన్నీ యాదవ్. ప్రపంచమంతా తిరుగుతూ వీడియోలు చేసి తన యూట్యూబ్‌ చానెల్లో పెడితే ఎవరూ చూడటం లేదని, దాని వల్ల ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువ అవుతోందని.. అందుకే తాను బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేయాల్సి వస్తోందనేది సన్నీయాదవ్ వాదన.

ఇదీ.. బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్‌పై సన్నీ యాదవ్ చెస్తోన్న అడ్డగోలు వాదన. యూట్యూబ్ చానెల్ పెట్టుకోవడం, దాని ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలనుకోవడంలో తప్పు లేదు. కానీ, వ్యూస్‌ రాకపోతే.. ఇంకా బెటర్‌గా ఏం చేస్తే వ్యూస్‌ వస్తాయని ఆలోచించి, ఆ దిశగా కృషి చేస్తే ఫర్వాలేదు. కానీ… ఆదాయం లేదనే సాకుతో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయడమే తప్పు. అసలు సన్నీ యాదవ్‌ యూట్యూబ్ చానెల్ అందరూ ఎందుకు చూడాలి? అతను ప్రపంచమంతా తిరుగుతూ చేసే వీడియోలు ఎవరికి కావాలి? అతని వీడియోల మీద, అతని చానెల్‌ మీద ఎవరికి ఇష్టం ఉంటే వాళ్లు అతణ్ని ఫాలో అవుతారు.

అంతే తప్ప… తాను వీడియోలు చేస్తున్నాను కాబట్టి, యూట్యూబ్ చానెల్ నడుపుతాను కాబట్టి, తనకు ఆదాయం వచ్చేలా జనమంతా తన వీడియోలు చూడాలని సన్నీయాదవ్‌ అనుకోవడం మూర్ఖత్వం. తన వీడియోలు చూసేవాళ్లు లేరని, ఆదాయం లేదని.. జనం ఏమైపోయినా ఫర్వాలేదు, తాను మాత్రం కోట్లు సంపాదించాలనే ధ్యేయంతో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్ చేస్తానని చెప్పడం ఎంత వరకు కరెక్ట్? ఒకవేళ చేసినా.. దాని వల్ల జనం డబ్బు పోగొట్టుకుని చివరికి ప్రాణాలే తీసుకుంటున్న ఉదంతాలు చూసిన తర్వాతైనా.. సన్నీయాదవ్‌ లాంటి యూట్యూబర్లలో మార్పు రావాలి కదా? కానీ రావడం లేదు. జనం చచ్చినా ఫర్వాలేదు. తమకు మాత్రం డబ్బులే ముఖ్యమన్న రీతిలో బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అందుకే… ఇలాంటి యూట్యూబర్లపై పోలీసులు కేసులు పెడుతున్నారు. కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు.

బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తున్నందుకు సన్నీ యాదవ్‌పై ఇప్పటికే తెలంగాణలో కేసు నమోదైంది. పోలీసులు అతను దొరికితే అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ సన్నీయాదవ్‌ మాత్రం ఇంకా విదేశాల్లోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నదీ ఇంకా స్పష్టంగా తెలియదు. పోలీసులు అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆచూకీ దొరికితే ఇండియాకు రప్పించి, అరెస్ట్‌ చేసి, కఠిన శిక్షలు పడేలా చూస్తామంటున్నారు.

తరవాత కథనం