Ravichandran Ashwin: ధోని ఆ బహుమతి ఇస్తాడనుకోలేదు: అశ్విన్

టీమిండియా స్టార్, మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా సడన్ డెసిషన్ తీసుకున్నాడు. అర్ధాంతరంగా తన రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ సమయంలో టీమిండియా ఫ్యాన్స్ సహా తోటి క్రీడాకారులు షాక్ అయ్యారు.

ఇంత సడన్ గా డెసిషన్ తీసుకోవడం వెనుక ఏదో ఒకటి జరిగే ఉంటుందని క్రికెట్ అభిమానులు చర్చించుకున్నారు. అతడిని బెంచ్ కే పరిమితం చేయడంతో నిరాశ చెంది ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై అశ్విన్ సైతం గతంలో క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా మరోసారి అశ్విన్ స్పందించాడు. స్వదేశంలో తన 100వ టెస్టు సమయంలోనే టెస్టులకు గుడ్ బై చెప్పాలని తాను భావించినట్లు తెలిపాడు. ఆ మ్యాచ్ లోనే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చేతుల మీదుగా మొమెంటో అందుకోవాలని అనుకున్నా అది కుదరలేదని తెలిపాడు. తన వందో టెస్ట్ నేపథ్యంలో మెమొంటో అందించేందుకు ధోనిని ఆహ్వానించానని.. కానీ అందుకు అతడికి కుదరలేదని తెలిపాడు.

అయితే అంతకంటే పెద్ద బహుమతిస్తూ తనను తిరిగి సీఎస్కే లోకి తీసుకుంటాడని అస్సలు ఊహించలేదని అన్నాడు. ఐపీఎల్ లో చెన్నైకి మళ్ళీ ఆడబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని.. తనకు ఈ అవకాశం ఇచ్చిన ధోనీకి ధన్యవాదాలు అంటూ తెలిపాడు. కాగా అశ్విన్ 2008లో సీఎస్కే తోనే ఐపిఎల్ కెరీర్ ఆరంభించాడు. ఆ తరువాత సిఎస్కే నుండి వీడి పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ జట్లకు ఆడాడు.

తరవాత కథనం