మార్చి నెలలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి నుండి వచ్చే వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక వేడి కారణంగా మధ్యాహ్నం బయటకు వెళ్లడం మానేస్తున్నారు. అందువల్ల వేసవిలో ఇంటి నుండి బయటకు వెళ్లాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. స్కిన్ కేర్ నిపుణులు ఎక్కువగా సన్ స్క్రీన్ యూజ్ చేయాలని సిఫార్సు చేస్తున్నారు. అయితే ఎంత SPF సన్‌స్క్రీన్ కొనాలో అందరికీ తెలిసే ఉంటుంది కానీ చర్మ రకాన్ని బట్టి సన్ స్క్రీన్ కొనుగోలు చేయాలని మీకు తెలుసా?. అవును స్కిన్ టోన్ బట్టి సన్ స్క్రీన్ వాడాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చర్మ రకాన్ని బట్టి ఎలాంటి సన్‌స్క్రీన్ ఉపయోగించాలో తెలుసుకుందాం.
పొడి చర్మం:
మీ చర్మం ఎప్పుడూ పొడిగా ఉండి, సన్‌స్క్రీన్ వాడాలనుకుంటే క్రీమ్ ఆధారిత లేదా మాయిశ్చరైజింగ్ సన్‌స్క్రీన్ బెస్ట్ ఆప్షన్. హైలురోనిక్ ఆమ్లం, విటమిన్ E కలిగిన సన్‌స్క్రీన్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే ఏ సన్‌స్క్రీన్ సరైనదో మీకు ఖచ్చితంగా తెలియకపోతే, కోకో వెన్న లేదా కలబంద ఉన్న సన్‌స్క్రీన్‌ను కొనుక్కోవచ్చు.
జిడ్డుగల చర్మం:
మీ చర్మం జిడ్డుగా ఉంటే, మీరు ఎల్లప్పుడూ జెల్ ఆధారిత లేదా మ్యాట్-ఫినిష్ సన్‌స్క్రీన్‌లను ఎంచుకోవాలి. ఈ రెండు రకాల సన్‌స్క్రీన్‌లు ముఖంపై అదనపు నూనెను నియంత్రించడంలో సహాయపడతాయి. దీన్ని కొనుగోలు చేసేటప్పుడు, ఆయిల్-ఫ్రీ, నాన్-కామెడోజెనిక్ ఫార్ములా ఉండేట్లు చూసుకోవాలి. దీన్ని ఉపయోగించడం ద్వారా రంధ్రాలు మూసుకుపోయే ప్రమాదం తగ్గుతుంది.
సాధారణ చర్మం:
మీ చర్మం సాధారణంగా ఉంటే మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని కోసం మీరు వాటర్ ఆధారిత సన్‌స్క్రీన్‌ను ఉపయోగించవచ్చు.
మొటిమలకు గురయ్యే చర్మం:
మొటిమలతో ఇబ్బంది పడుతుంటే నాన్-కామెడోజెనిక్, ఆయిల్-ఫ్రీ సన్‌స్క్రీన్‌లను కొనండి. సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్ కలిగిన సన్‌స్క్రీన్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.