Anchor Vishnu Priya: హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ !

Anchor Vishnu Priya

Anchor Vishnu Priya: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరిలో.. ఇప్పుడు బెదురు మొదలైంది. వరుసగా నమోదవుతున్న కేసులు.. ఒక్కొక్కరికి వణుకు పుట్టిస్తున్నాయ్. ఈ లిస్టులోకి ఇప్పుడు హీరో రానా, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు కూడా చేరిపోయారు. సెలబ్రిటీలు, యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు అనే తేడా లేకుండా 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాంతో.. నెక్ట్స్ ఏం జరగబోతోందనేది ఆసక్తిగా మారింది.

ఏమాత్రం ఆలోచించకుండా, తమనెవరు అడుగుతారులే అని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరికీ.. ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయ్. ఈ వ్యవహారం.. రోజుకో మలుపు తీసుకుంటోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరిపై.. వరుసగా కేసులు నమోదవుతున్నాయ్. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. బెట్టింగ్స్, ఆన్ లైన్ గేమ్స్ ఆడేలా ప్రేరేపించిన బెట్టింగ్ రాయుళ్ల బెండు తీస్తున్నారు పోలీసులు. పాపులర్ సెలబ్రిటీలు, యాక్టర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొన్నటిదాకా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న వీళ్లంతా.. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌తో కేసుల పాలై.. వార్తల్లోకి ఎక్కేశారు. ఇప్పుడు ఈ రకంగా మళ్లీ ట్రెండ్ అవుతున్నారు.

తాజాగా బెట్టింగ్ యాప్స్‌ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు పంజాగుట్ట పోలీసుల ముందు రెండోసారి విచారణకు హాజరుకానున్నారు రీతు చౌదరి. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విచారణకు సహకరించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో విష్ణుప్రియ తెలంగాణ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేసింది. ఇవాల ఆమె పిటిషన్‌పై హైకోర్ట్‌లో విచారణ జరగనుంది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రెటీల చుట్టూ కేసు తిరుగుతుంది. ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు నిన్న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి సహా మొత్తం 25మందిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న బెట్టింగ్ యాప్స్ ఓనర్స్‌పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. సెలబ్రిటీలను విట్నెస్‌లుగా మార్చే ఆలోచనలో ఉన్నారు. 19మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్స్‌పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ యజమానులే కీలక నిందితులుగా చేర్చి.. సెలబ్రిటీలను సాక్షాదారులుగా చేర్చే యోచనలో ఉన్నారు పోలీసులు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కేసులు నమోదవడం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో సంచలనంగా మారింది. ఇప్పటికే.. ఈ కేసుల్లో నిందితుల్ని విచారణకు పిలవడం మొదలుపెట్టారు పోలీసులు. కొందరికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఎంక్వైరీలో.. వారు బెట్టింగ్ యాప్స్‌ని ఎందుకు ప్రమోట్ చేశారు? ఎలా ప్రమోట్ చేశారు? ఇందుకుగానూ.. బెట్టింగ్ కంపెనీల నుంచి ఎంత మొత్తంలో చెల్లింపులు అందుకున్నారు? లాంటి వివరాలను సేకరిస్తున్నారు. ఇక.. ఈ కేసులో మనీలాండరింగ్, హవాలా లావాదేవీల అనుమానాలతో ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది.

యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు అందుకున్న డబ్బుల మూలాల్ని, వాటి బదిలీ విధానాలను ఈడీ పరిశీలిస్తోంది. దాంతో.. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు మరో స్థాయికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయ్. నిందితులపై ఇప్పటికే.. బీఎన్ఎస్, ఐటీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో గనక నేరం రుజువైతే.. జరిమానాలు, జైలు శిక్ష, కొందరికీ రెండూ విధించే అవకాశం ఉంది. గతంలో ఈ తరహా కేసుల్లో కొందరు రిమాండ్‌కి కూడా వెళ్లారు.

తరవాత కథనం