Shruti Haasan: సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారినపడని కథానాయికలు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఉచితంగా వచ్చింది కాబట్టి.. సోషల్ మీడియాలో తమకు అనిపించిన విషయాలను ఎలాంటి ఫిల్టర్లు లేకుండా చెప్పేస్తుంటారు నెటిజన్లు. దీని వల్ల ఎక్కువగా ఇబ్బందిపడేది సెలబ్రిటీలే. అలాంటివారిలో శ్రుతి హాసన్ ఒకరు. సెలబ్రిటీ డాటర్‌గా కెరీర్‌ను ప్రారంభించాల్సిన శ్రుతి.. తన కాళ్ల మీద తాను నిలబడి కెరీర్‌ను మలచుకుంది. అయితే ఆమెను మరో కోణంలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాపై నటి శృతి హాసన్ హాట్ కామెంట్స్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ కీలక పాత్ర పోషించింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజినీకాంత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మాట్లాడింది. అదే సమయంలో తన తండ్రి కమల్ హాసన్ పేరు ప్రస్తావించకుండా రజినీకాంత్ గొప్పవాడు అని చెప్పడంతో కమల్ అభిమానులు హర్ట్ అయ్యారు. ‘‘మీ తండ్రి విశ్వ నటుడు.
ఆయన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటి’’ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘‘రజినీకాంత్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంత పెద్ద స్టార్‌గా ఆయన ఎలా ఎదిగారో, ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడే అర్థమయ్యింది. సినిమా పట్ల అంకిత భావం, క్రమశిక్షణ, పాత్ర కోసం కష్టపడే తత్వం ఇలా ఎన్నో విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. వినయంగా ఉంటారు. సెట్లో ఎప్పుడూ కూడా చాలా ఎనర్జిటిక్‌గా పనిచేస్తారు.
ఈ వయసులో కూడా అంత కాన్ఫిడెంట్‌గా ఉండడమే కాకుండా అంత పాజిటివిటీ ఆయనలో ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. ముఖ్యంగా ఇతరులతో ఎలా వ్యవహరించాలో రజినీకాంత్‌ను చూసే నేను తెలుసుకున్నాను” అంటూ శృతి తెగ పొగిడేసింది. దీంతో తండ్రిని కాదని రజినీకాంత్‌పై ప్రశంసలు కురిపించడంతో కొందరు ట్రోల్ చేస్తున్నారు.