Anchor Vishnu Priya: విష్ణు ప్రియకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

Anchor Vishnu Priya

Anchor Vishnupriya: బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణుప్రియ పిటీషన్‌పై హైకోర్టు షాకిచ్చింది. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని విష్ణుప్రియ వేసిన పిటిషన్‌ కోర్టు కొట్టేసింది. దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని విష్ణుప్రియను ఆదేశించిది. చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. బెట్టింగ్ యాప్స్‌పై ప్రచారం చేసినందుకు మియాపూర్‌ పీఎస్‌లో విష్ణుప్రియపై కేసు నమోదైంది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరిలో.. ఇప్పుడు బెదురు మొదలైంది. వరుసగా నమోదవుతున్న కేసులు.. ఒక్కొక్కరికి వణుకు పుట్టిస్తున్నాయ్. ఈ లిస్టులోకి ఇప్పుడు హీరో రానా, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు కూడా చేరిపోయారు. సెలబ్రిటీలు, యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు అనే తేడా లేకుండా 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాంతో.. నెక్ట్స్ ఏం జరగబోతోందనేది ఆసక్తిగా మారింది.

ఏమాత్రం ఆలోచించకుండా, తమనెవరు అడుగుతారులే అని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరికీ.. ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయ్. ఈ వ్యవహారం.. రోజుకో మలుపు తీసుకుంటోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరిపై.. వరుసగా కేసులు నమోదవుతున్నాయ్. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. బెట్టింగ్స్, ఆన్ లైన్ గేమ్స్ ఆడేలా ప్రేరేపించిన బెట్టింగ్ రాయుళ్ల బెండు తీస్తున్నారు పోలీసులు. పాపులర్ సెలబ్రిటీలు, యాక్టర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొన్నటిదాకా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న వీళ్లంతా.. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌తో కేసుల పాలై.. వార్తల్లోకి ఎక్కేశారు. ఇప్పుడు ఈ రకంగా మళ్లీ ట్రెండ్ అవుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా మనం చూసింది, ఎంతో కొంత తెలిసింది.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు మాత్రమే. కానీ.. అవి మాత్రమే కాదు.. గ్యాంబ్లింగ్ యాప్స్, ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్స్ లాంటివి చాలానే ఉన్నాయ్. అన్నీ.. జనాన్ని ముంచేవే!

బెట్టింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల లిస్టులో.. హీరో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, యాక్టర్ ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. వీళ్లంతా.. పాప్ అప్ యాడ్స్ ద్వారా వివిధ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు. ఇక.. సినీ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల లిస్టులో.. అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, సుప్రిత సహా మొత్తం 25 మంది ఉన్నారు. వీరిలో.. కొందరు ఒకట్రెండు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే.. బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి లాంటోళ్లు.. మల్టిపుల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని.. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. మియాపూర్‌ వాసి ప్రమోద్‌ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

హీరో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్ లాంటి సెలబ్రిటీలు.. పాప్ అప్ యాడ్స్ ద్వారా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్, ఆన్‌లైన్ గేమింగ్, రమ్మీ యాప్స్‌ని ప్రమోట్ చేశారు. ఇంకొందరు.. పాప్ అప్ యాడ్స్‌తో పాటు ఆ బెట్టింగ్ యాప్స్‌లోనూ, వెబ్ సైట్స్ లోనూ ప్రమోట్ చేశారు. ఇంకొందరు.. ఓ అడుగు ముందుకేసి.. నేరుగా ప్రమోషనల్ వీడియోలతోనే ప్రచారం చేశారు. వాళ్ల సోషల్ మీడియా అకౌంట్స్‌లో వాటిని అప్‌లోడ్ చేసి.. ఫాలోవర్లను ప్రభావితం చేశారు. ఇప్పటికే విష్ణుప్రియ లాంటి కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు లాయర్లతో వచ్చి పోలీసుల ముందు హాజరయ్యారు. విచారణకు హాజరవుతున్న వాళ్ల దగ్గర్నుంచి.. బెట్టింగ్ యాప్స్ కంపెనీలు, వాటి నిర్వాహకుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కేసులు నమోదవడం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో సంచలనంగా మారింది. ఇప్పటికే.. ఈ కేసుల్లో నిందితుల్ని విచారణకు పిలవడం మొదలుపెట్టారు పోలీసులు. కొందరికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఎంక్వైరీలో.. వారు బెట్టింగ్ యాప్స్‌ని ఎందుకు ప్రమోట్ చేశారు? ఎలా ప్రమోట్ చేశారు? ఇందుకుగానూ.. బెట్టింగ్ కంపెనీల నుంచి ఎంత మొత్తంలో చెల్లింపులు అందుకున్నారు? లాంటి వివరాలను సేకరిస్తున్నారు. ఇక.. ఈ కేసులో మనీలాండరింగ్, హవాలా లావాదేవీల అనుమానాలతో ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు అందుకున్న డబ్బుల మూలాల్ని, వాటి బదిలీ విధానాలను ఈడీ పరిశీలిస్తోంది. దాంతో.. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు మరో స్థాయికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయ్. నిందితులపై ఇప్పటికే.. బీఎన్ఎస్, ఐటీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో గనక నేరం రుజువైతే.. జరిమానాలు, జైలు శిక్ష, కొందరికీ రెండూ విధించే అవకాశం ఉంది. గతంలో ఈ తరహా కేసుల్లో కొందరు రిమాండ్‌కి కూడా వెళ్లారు.

ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు.. తమ లాయర్ల ద్వారా నోటీసులకు సమాధానాలు ఇచ్చారు. ఇంకొందరు.. విచారణకు గడువు కోరినట్లు తెలుస్తోంది. కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు తమకు తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని.. వీడియోలు కూడా రిలీజ్ చేశారు. కానీ.. ఇప్పటికే చేసిన వీడియోలు, ప్రమోషన్ల ఆధారంగా కేసు ముందుకు సాగుతోంది. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపైనా బెట్టింగ్ ప్రమోషన్‌కి సంబంధించిన కేసు నమోదైంది. దాంతో.. ఈ వ్యవహారం ఏపీలో రాజకీయ రంగు పులుముకుంది. మున్ముందు రాజకీయ చర్చలకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో విచారణ ముమ్మరంగా సాగనుంది. ఈడీ గనక ఆర్థిక లావాదేవీలను లోతుగా తవ్వితే మాత్రం.. ఇంకొందరి ప్రమేయం కూడా బయటపడే అవకాశం ఉంది.

తరవాత కథనం