మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన ఈ చిత్రం మరింత పెద్ద హిట్ అవుతుందని అంతా భావించారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యాయి. దీంతో ఈ సారి ఎలాగైనా ఒక పెద్ద హిట్ కొట్టాలని చరణ్ డిసైడ్ అయ్యాడు.
ఇందులో భాగంగానే ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టైటిల్ అండ్ రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈచిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదే జోష్‌లో ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో సర్ ప్రైజ్ అందించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.
గ్లింప్స్ డేట్
ఈ గ్లింప్స్ తేదీని మేకర్స్ తాజాగా వెల్లడించారు. పెద్ది సినిమా గ్లింప్స్ వీడియోను ఏప్రిల్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి రోజున ఈ గ్లింప్స్ రిలీజ్ అవుతుంది. పెద్ది ఫస్ట్ షాట్ పేరుతో ఈ గ్లింప్స్‌ను ఏప్రిల్ 6న విడుదల చేయనున్నారు. ఉగాది సందర్భంగా నేడు ఈ గ్లింప్స్ అప్డేట్ అందించారు. ఈ మేరకు పెద్ది గ్లింప్స్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
అందులో రామ్‌చరణ్ గాల్లోకి ఎగిరి ఏదో ఆటకు బరిలోకి దిగుతున్నట్టుగా కనిపిస్తోంది. చుట్టూ జెండాలు పట్టుకొని జనాలు కేరింతలు కొడుతున్నట్లు ఉంది. అందులోంచి చరణ్ గాల్లోకి ఎగిరినట్లు కనిపిస్తుంది. ఈ పోస్టర్ మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే ఈ పెద్ది సినిమా స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో రిలీజ్ కానున్న గ్లింప్స్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ రానుంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. దీనికోసం ఒక బలమైన స్క్రిప్ట్‌ను తయారు చేసినట్టు సమాచారం. రంగస్థలం రేంజ్లో ఈ చిత్రంలో చరణ్ కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నారు.