ఐపీఎల్ 2025 సీజన్ గమ్మత్తుగా నడుస్తోంది. పలు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్లుగా జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫుల్ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆడిన రెండు మ్యాచ్‌లు ఘన విజయం సాధించి దుమ్ముదులిపేసింది. వరుసగా రెండు మ్యాచుల్లో RCB సత్తా చాటింది.
ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్‌తో తలపడి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ను సొంతగడ్డపై ఓడించి అందిరినీ ఆశ్చర్యపరచింది. ఇటీవలే MA చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
దీంతో చెన్నై సొంతగడ్డపై 17 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంళూరు జట్టు విజయం సాధించి అబ్బురపరచింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం 197 పరుగుల టార్గెట్ కోసం బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ జట్టు దాదాపు 50 పరుగుల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది.
దీంతో వరుసగా రెండు విజయాలు సొంతం చేసుకోవడంతో ఆర్సీబీ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆర్సీబీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీల లిస్ట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను వెనక్కి నెట్టి ఆర్సీబీ తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్‌ను 17.7 మిలియన్ల మంది ఇన్‌స్టాలో ఫాలో అయ్యారు. తాజాగా సీఎస్కేను వెనక్కి నెట్టి ఆర్సీబీ 17.8 మిలియన్ల మంది ఫాలోవర్లను కైవసం చేసుకుంది.