చాలా వరకు ప్రోటీన్ అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకం అని అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ప్రజలు అధిక ప్రోటీన్ ఆహారంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని ఏదో ఒక రూపంలో తరచూ తీసుకుంటున్నారు. కానీ అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని మీకు తెలుసా?. అవును.. అధిక ప్రోటీన్ కూడా శరీరంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ప్రొటీన్ ఎక్కువగా తీసుకునేవారు కాస్త జాగ్రత్త పడాల్సిందే. అది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే హాని గురించి తెలుసుకుందాం.
ఆరోగ్య నిపుణుల ప్రకారం..
సాధారణంగా తక్కువ మోతాదులో ప్రొటీన్లు తీసుకుంటే ఏం కాదని.. కానీ అధిక మొత్తంలో ప్రోటీన్ తీసుకుంటే అది మూత్రపిండాలు, ఇతర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అది ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు.
మూత్రపిండాలపై ప్రభావం
అధిక మొత్తంలో ప్రొటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలకు హాని కలుగుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మూత్రపిండాలు శరీరం లోపల పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల కడుపులో ఆమ్ల వాతావరణం ఏర్పడుతుంది. దీని కారణంగా ఎక్స్ ట్రా యూరిన్, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
బరువు పెరుగడం
అధిక ప్రోటీన్ ఆహారం.. శరీరం నుండి అదనపు కొవ్వు, బరువును తగ్గించడంలో సహాయపడుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే అది వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే శరీరం అదనపు ప్రోటీన్‌ను కొవ్వుగా మార్చుతుంది. ఆ సమయంలో దానిని స్టోర్ చేసి వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది.
మలబద్ధకం
అధిక ప్రోటీన్ తీసుకుంటే.. అది మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అలాంటి సమయంలో ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో మాత్రమే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
ఎముకలపై ప్రభావం
శరీరంలో ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కాల్షియం లోపం ఏర్పడుతుంది. దీని కారణంగా ఎముకలు బలహీనమవుతాయి. అధిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా అదనపు కాల్షియం విడుదల అవుతుంది. ఇది ఎముకల బలహీనత ప్రమాదాన్ని పెంచుతుంది.
గుండె జబ్బు
అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఫలకం పేరుకుపోతుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. అలాంటి సమయంలో ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.