Bridge to Terabithia: జీవితంలో ఒంటరితనం ఉన్నప్పుడు కొంతమంది ఒక మెరుపులా వచ్చి వెళ్తారు. వాళ్లు వచ్చినప్పుడు జీవితం మీద ఆశలు చిగురిస్తాయి. వాళ్లు మనకు ఎంతో దగ్గరగా అనిపిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒంటరిగా ఫీల్ అవుతున్న ఒక అబ్బాయికి, ఒక ఎనర్జిటిక్ అమ్మాయి తోడవుతుంది. వీళ్ళిద్దరూ ఈ మూవీలో గడిపే సమయం బాగా ఆకట్టుకుంటుంది. మూవీ చూసే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో లో
అమెరికన్ ఫాంటసీ డ్రామా సినిమా పేరు ‘బ్రిడ్జ్ టు టెరాబిథియా’. దీనికి గాబర్ స్సుపో దర్శకత్వం వహించారు. ఇది 1977లో కేథరీన్ ప్యాటర్సన్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో జోష్ హచర్సన్, అన్నాసోఫియా రాబ్, జూయ్ డెస్చానెల్ , రాబర్ట్ పాట్రిక్ నటించారు. ఈ మూవీ యుక్తవయసులో ఉండే జెస్ ఆరోన్స్, లెస్లీ బుర్క్ చుట్టూ తిరుగుతుంది.
వారు తమ ఖాళీ సమయాన్ని కలిసి గడపడానికి, ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించుకుంటారు.71 ఏళ్ల ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మైఖేల్ చాప్‌మన్‌కి ఇదే చివరి మూవీ కావడం విశేషం. ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా $137 మిలియన్లు వసూలు చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
జెస్ ఆరన్స్ ఐదవ తరగతి చదువుతూ ఉంటాడు. అతను పేద కుటుంబం నుండి వస్తాడు. స్కూల్ లో ఎక్కువగా ఒంటరిగానే ఉంటాడు. అతను డ్రాయింగ్ చేయడంలో ప్రతిభావంతుడు. కానీ అతని కుటుంబం, సహవిద్యార్థుల నుండి పెద్దగా ప్రోత్సాహం లభించదు. ఒక రోజు, అతనికి పొరుగింటిలో ఉండే లెస్లీ బర్క్ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. లెస్లీ ఒక ముందు చూపు, ధైర్యం గల అమ్మాయి. ఆమె జెస్‌తో స్నేహం చేస్తుంది.
ఒకసారి పాఠశాలలో జరిగిన ఒక సంఘటన తర్వాత ఇద్దరూ, కలిసి అడవిలోకి వెళతారు. అక్కడ వారు ఒక పాత తాడు స్వింగ్‌ని ఉపయోగించి ఒక సీక్రెట్ ప్రపంచాన్ని సృష్టిస్తారు. దానికి ‘టెరాబిథియా’ అని పేరు పెడతారు. అది వాళ్ళ ఊహాల్లో ఉండే ఒక రాజ్యంగా భావిస్తారు. అక్కడ వారు రాజు, రాణిగా ఉంటారు ఊహించుకుంటారు. ఈ ఊహా ప్రపంచం వారికి వాస్తవ జీవితంలోని సమస్యల నుండి తప్పించుకునే మార్గంగా మారుతుంది.
జెస్‌కి తన కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నుండి, లెస్లీకి తన కొత్త పరిసరాలకు అలవాటు పడే సవాళ్ల నుండి ఈ ఊహా ప్రపంచం కొంత రిలాక్స్ ఇస్తుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, జెస్, లెస్లీ ఒకరికొకరు ధైర్యం, ఆత్మవిశ్వాసం చెప్పుకుంటారు. ఆమెతో ఉండటం వలన జెస్ తన భయాలను అధిగమిస్తాడు. అయితే ఇప్పుడే ఒక ఊహించని ట్విస్ట్ వస్తుంది.
ఒక రోజు జెస్ తన సంగీత టీచర్‌తో ఒక ట్రిప్‌కి వెళతాడు. ఒంటరిగా ఉన్న లెస్లీ టెరాబిథియాకు వెళుతుంది. ఆ సమయంలో, తాడు స్వింగ్ తెగిపోవడంతో ఆమె నదిలో పడి మునిగి చనిపోతుంది. లెస్లీ మరణం జెస్‌ని తీవ్రంగా కలచివేస్తుంది. చివరికి జెస్ ఒంటరి జీవితాన్ని ఎలా గడుపుతాడు ? లెస్లీ నుంచి జెస్ ఎం నేర్చుకుంటాడు. ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఫాంటసీ మూవీని చూడండి.