చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల వేసవి, వర్షాకాలం, శీతాకాలం వంటి వాతావరణ మార్పుల సమయంలో పిల్లల చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మారుతున్న వాతావరణంలో, పిల్లల సున్నితమైన చర్మాన్ని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా వాతావరణంలో మార్పు తర్వాత తేమ తక్కువగా ఉన్నప్పుడు పిల్లల చర్మంపై వేడి దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. అదే సమయంలో అది ఎక్కువగా ఉంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పిల్లల చర్మాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తేలికపాటి దుస్తులు ధరించండి
ప్రతి సీజన్‌లో పిల్లలకు సరైన దుస్తులను సెలెక్ట్ చేయడం చాలా ముఖ్యం. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు ఎండ, మరోవైపు వర్షంతో ప్రజలు తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారు. ఈ సమయంలో పిల్లలు కాటన్, తేలికపాటి దుస్తులను ధరించాలి. దోమల బెడద మన చుట్టూ కనిపిస్తుంది. అందువల్ల పిల్లలు పూర్తి చేతుల కాటన్ దుస్తులను ధరించాలి. ఇది వారిని దోమల నుండి రక్షించి, వారికి సుఖంగా ఉండేలా చేస్తుంది.
సరైన నూనె
వాతావరణం మారినప్పుడు పిల్లల చర్మాన్ని కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. కొబ్బరి నూనెలో సహజ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల చర్మాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు సహజ తేమను లాక్ చేస్తాయి. కొబ్బరి నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మారుతున్న వాతావరణంలో దురద, చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి పిల్లల చర్మాన్ని రక్షిస్తాయి.
సరైన సబ్బు
రసాయనాలు కలిగిన సబ్బులను ఉపయోగించ కూడదు. ఒకవేళ అలా ఉపయోగిస్తే పిల్లల చర్మం కఠినంగా, పొడిగా మారుతుంది. అందువల్ల వాతావరణం మారినప్పుడు.. ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో పిల్లలకి స్నానం చేయాలి. తేలికపాటి బేబీ సబ్బు లేదా తేలికపాటి క్లెన్సర్ ఉపయోగించాలి. స్నానం చేసేటప్పుడు.. పిల్లల చర్మానికి ఒకసారి మాత్రమే సబ్బును రాయాలి. పిల్లల చర్మంపై సబ్బును పదే పదే రుద్దడం వల్ల తేమ తొలగిపోతుంది. స్నానం చేసిన తర్వాత పిల్లల చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి బేబీ లోషన్ లేదా అలోవెరా జెల్ రాయాలి.
సన్‌స్క్రీన్
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎండలోకి తీసుకెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ రాయరు. ఇలా చేయడం చాలా తప్పు. సూర్యుడి నుండి వారిని రక్షించడానికి పిల్లల చర్మంపై సన్‌స్క్రీన్ రాయాలి. అందువల్ల పిల్లలకు SPF సన్‌స్క్రీన్ ఎంత వాడాలో మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించాలి.
పరిశుభ్రత
మారుతున్న వాతావరణంలో.. గాలిలోని దుమ్ము, ధూళి నుండి పిల్లల చర్మాన్ని రక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మురికి, దుమ్ము ప్రదేశాలలో ఆడుకోకుండా వారిని కంట్రోల్ చేయాలి. ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.