ప్రముఖ పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు. ఆయన ఇవాళ (శనివారం) తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. రామయ్య గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ గుండెపోటు రావడంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ అందిస్తుండగా ప్రాణాలు విడిచారు. ఆయన మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు.
కాగా ఆయన అసలు పేరు దరిపల్లి రామయ్య. ఆయన తెలంగాణలోని ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి లో జన్మించారు. ఆయన కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. అక్కడ నుంచి ఆయన పేరు వనజీవి రామయ్యగా మారిపోయింది. అంతేకాకుండా ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా గా గుర్తింపు దక్కించుకున్నాడు.
రామయ్య సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017 లో పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. రామయ్య దంపతులు దాదాపు 5 దశాబ్దాలకు పైగా సామాజిక అడవుల పెంపకం కోసం కృషి చేస్తూ వచ్చారు. ప్రకృతి పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఆయన ఎప్పుడూ ఆకాంక్షించేవారు. దాదాపు కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించాడు.
ఇప్పుడు ఆయన మృతితో ప్రకృతి ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు. పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆయన సేవలను సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. రామయ్య సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేశారు.