ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. ఇందులో భాగంగానే గురువారం ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలులోకి తెచ్చింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మంగళవారం ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత వెంటనే రాష్ట్ర గవర్నర్ దీన్ని ఆమోదించారు. దీంతో గురువారం అఫీషియల్ గా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025 కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి దీనిని రిలీజ్ చేశారు. తద్వారా విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, నియామక ప్రకటనలకు, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులకు వర్గీకరణ అమలు కానుంది. రాష్ట్రంలో షెడ్యూల్ కులాలన్నింటికీ సరైన విద్య, ఉద్యోగం, న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చేసుకుని మొత్తం 15% రిజర్వేషన్లను మూడు భాగాలుగా విభజించింది ఏక సభ్య కమిషన్.
ఇందులో గ్రూప్ 1 కింద రెల్లి, ఉపకలాలు (12 కులాలు) చేర్చి 1 శాతం రిజర్వేషన్ కల్పించారు. గ్రూప్ 2 కింద మాదిగ, ఉప కులాలు (18 కులాలు) చేర్చి 6.5% రిజర్వేషన్లు కల్పించారు. గ్రూప్ 3 కింద మాల, ఉప కులాలు (29 కులాలు) చేర్చి 7.5% రిజర్వేషన్ కేటాయించారు. దీని ద్వారా ఎస్సీల్లో 59 ఉప కులాలకు లబ్ధి చేకూరనుంది. కాగా దీనిని 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన సేకరించారు.
ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు ఆగస్టులో ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయా వర్గాల వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని.. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది. దీంతో విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజాన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్ ను నియమించారు.
ఇది రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రజాప్రతినిధులు, పలు సంఘాలు, ప్రజల నుంచి వినతులు అందుకుంది. పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీ, పథకాల అమలు, పదోన్నతుల తీరును పరిశీలించింది. ఇలా ఐదు నెలల పాటు అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి 360 పేజీల నివేదికను అందించింది. దానిని ప్రభుత్వం యధాతధంగా ఆమోదించింది.