వేసవికాలంలో శరీరానికి చలువ చేసే పదార్థాలు, పానీయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ బారి నుంచి బయటపడవచ్చు. అలాగే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేసవికాలంలో మజ్జిగ తాగడం చాలా ముఖ్యం. పెరుగు కంటే మజ్జిగ వేసవిలో మంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
అందువల్ల వేసవికాలంలో రోజుకు రెండుసార్లు ఆహారంలో మజ్జికను చేర్చుకోవాలి. పెరుగుతో తయారయ్యే ఈ మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామందిలో కొన్ని డౌట్స్ ఉండొచ్చు. పెరుగు కూడా మంచిదే కదా దానిని కాదని మజ్జిగ ఎందుకు ప్రయోజనమో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
పెరుగులో చురుకైన బ్యాక్టీరియా ఉంటుంది. అది వేడికి ఎప్పుడైతే గురవుతుందో అప్పుడు పుల్లగా పులియడం ప్రారంభిస్తుంది. అప్పుడు పెరుగు తింటే అది పొట్టలోకి చేరి అక్కడ వేడి చేయడం ప్రారంభిస్తుంది. అలాంటప్పుడే శరీరం చలువ చేయడానికి బదులుగా వేడి చేస్తుంది. అందువల్ల దీన్ని నిరోధించడానికి మజ్జిగ ఎంతో ఉపయోగకరమైనది.
ఎందుకంటే మజ్జిగను నీరుతో కలిపి తయారుచేస్తారు. వీటితోపాటు మజ్జిగలో జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా వంటివి వేయడంతో శరీరాన్ని చలువ చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం మజ్జిగలో చలువ చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి.
వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఇది అద్భుతమైన పానీయం అని చెప్తున్నారు నిపుణులు. పెరుగులో నీరు కలిపి మజ్జిగ తయారు చేయడం వల్ల జీర్ణ సమస్యతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతిరోజు వేసవిలో రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల మజ్జిగ తాగాలి.