ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మత్స్యకారులకు అండగా నిలిచింది. చేపల వేట పై ఆధారపడిన ఎన్నో కుటుంబాల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ” మత్స్యకార సేవలో” అనే పథకాన్ని ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు.
ఒక్కో కుటుంబానికి రూ. 20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. సముద్రంలో చేపల వేట పై కొన్ని రోజులు నిషేధం ఉంటుంది. ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు అంటే 61 రోజులు పాటు సముద్రంలో చేపల వేట నిషేధం. ఆ సమయంలో మత్స్యకారులకు జీవనోపాధి ఉండదు. అందువల్ల వారికి సహాయం చేయడానికి ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మత్స్యకార సేవలో అనే పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఈ 20 వేల రూపాయల సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
ఇక ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం దాదాపు 258 కోట్ల రూపాయలు కేటాయించింది. కాగా గత ప్రభుత్వం మత్స్యకారులకు 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఇప్పుడు దాన్ని పెంచింది. కూటమి ప్రభుత్వం మరో 10 వేలు కలుపుతూ మొత్తం రూ.20000 అందిస్తుంది.