Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ ఎనర్జీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. దేశ విదేశాల్లో ఉన్న పెట్టుబడుదారులు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. నార్వే, బ్రిక్స్ దేశాలకు చెందిన మార్క్యూ పెట్టుబడిదారులు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌తో సమావేశమయ్యారు.
గొట్టిపాటి రవికుమార్‌తో పెట్టుబడుదారులు సమావేశం
గొట్టిపాటి రవి కుమార్‌తో సమావేశమైన వారిలో 12 రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రముఖ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ సీల్ సోలార్ ప్రతినిధులు కూడా ఉన్నారు. ఏపీలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు, వేస్ట్-టు-ఎనర్జీ ప్రోగ్రామ్స్, సోలార్ ప్యానల్ తయారీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు.
నార్‌ఫండ్ (నార్వేజియన్ సావరిన్ వెల్త్ ఫండ్), యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (DFC) ప్రతినిధులతో సహా వచ్చిన ప్రతినిధులంతా ఆంధ్రప్రదేశ్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌పై పూర్తి నమ్మకం ఉంచారు. ఈ రెండు సంస్థలు SAEL సోలార్ రెన్యూవబుల్ ఇంధన ప్రాజెక్టుల్లో కీలక భాగస్వాములుగా ఉన్నాయి. Norfund, నార్వేజియన్ క్లైమేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ద్వారా $60 మిలియన్లను, SAEL గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలకు మద్దతుగా DFC $35 మిలియన్లు అందించింది.
రెండు ప్రాజెక్టులు పెట్టనున్న సీల్ సోలార్
ఆంధ్రప్రదేశ్‌లో 1200 MW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి SAEL సోలార్ సంస్థ ఆసక్తి చూపిస్తోంది. ఒక్కొక్కటి 600 MW చొప్పున రెండు దశల్లో ఈ ప్రాజెక్టులు పూర్తి చేయనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రాకతో ఏపీ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ అని ప్రూవ్ అవుతుంది.
Also Read: పీపుల్ ఫస్ట్ విధానం, ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’ నినాదం- కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులకు గుడ్ ఛాయిస్ ఏపీ : గొట్టిపాటి
“ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతతో కూడిన నాయకత్వంలో క్లీన్ ఎనర్జీ ఆవిష్కరణలో ఏపీ అగ్రగామిగా నిలిచింది. 2047 నాటికి నికర ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలనే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 తీసుకొచ్చాం. ఈ పాలసీతో స్నేహపూర్వక పెట్టుబడి వాతావరణం ఏర్పడుతుంది. పైగా రాష్ట్రంలో స్వచ్ఛమైన ఇంధన విప్లవానికి నాంది పలుకుతుంది. గత ఐదేళ్లుగా YSRCP ప్రభుత్వం విధానం పెట్టుబడిదారులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడు మేము పెట్టుబడిదారులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రపంచస్థాయి పెట్టుబడుదారులను ఆకర్షించి ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక ఇంధన కేంద్రంగా మార్చే పనిలో ఉన్నాం. పెట్టుబడుదారులు త్వరగా వచ్చి కంపెనీలు స్థాపించేందుకు వీలుగా ICE విధానం రూపొందించాం. వచ్చే ఐదేళ్లలో మేము మా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాము. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్‌లో అగ్రగామిగా ఉంటాం.” అని అన్నారు.
త్వరితగతిన అనుమతులు ఇస్తామని మంత్రి హామీ
క్లీన్ ఎనర్జీ వెంచర్‌లకు ఆంధ్రప్రదేశ్‌ను అత్యుత్తమమైన గమ్యస్థానంగా మార్చేందుకు త్వరితగతి ఫాస్ట్ ట్రాక్ అనుమతులు ఇస్తామన్నారు మంత్రి. పెట్టుబడులను సులభతరం చేసేందుకు నిబద్ధతతో ఉంటామని హామీ ఇస్తూ సమావేశం ముగిసింది.
Also Read: జనసేనపై కాపు బాంబు – జగన్ మాస్టర్ ప్లాన్