90 Hours Working News: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్. ఆర్. నారాయణ మూర్తి, L&T చైర్మన్ S.N. సుబ్రమణ్యన్ పని గంటలపై చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీశాయి. ఒకరు వారానికి 70 గంటల పని చేయాలని చెబితే మరొకరు 90 గంటలు పని చేయాలని సలహా ఇస్తున్నారు. మొత్తానికి వీరి ప్రకటనలతో చాలా చర్చ నడుస్తోంది. ఇంతకీ అభివృద్ధి చెందిన దేశాల్లో వర్క్ కల్చర్ ఏంటీ… మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎలా పని చేస్తున్నారు… అసలు 90 గంటలు పని చేసే వ్యక్తులు ఉన్నారా… అలా చేస్తే ఉత్పాదకత పెరుగుతుందా అనే డిబేట్ నడుస్తోంది.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సైనికులు మాత్రమే వారానికి 90 గంటలు పని చేస్తారట. ILO డేటా ప్రకారం హోండురాస్‌లోని సైనికులు 2023లో వారానికి 80 గంటలు పని చేశారు. ఆ దేశంతోపాటు మరికొన్ని కంట్రీస్‌లో సాయుధ బలగాలు మాత్రమే వారానికి 90 గంటలు పనిచేస్తున్నాయని పేర్కొంది. ILO ప్రపంచవ్యాప్తంగా వర్క్ కల్చర్‌ను బట్టి మూడు వర్గాలుగా విభజించింది. అధికారిక లెక్కల ప్రకారం భారతదేశంలో క్లరికల్ సిబ్బంది వారానికి 56 గంటలు పని చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వైద్యులు, లాయర్లు వంటి వృత్తినిపుణులు వారానికి 52 గంటలే వర్క్ చేస్తున్నారు. భారతదేశంలో CEOలు, మేనేజర్లు, నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న వ్యక్తులు వారానికి 57 గంటలు పని చేస్తారు. ఈ విషయంలో మాత్రం భారత్ కంటే సూడాన్ ముందంజలో ఉంది. అక్కడ పని చేసే కీలకమైన స్థానంలో ఉన్న అధికారులు వారానికి 60 గంటలు పని చేస్తున్నారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత కష్టపడి పని చేసే మానవ వనరులు ఉన్న దేశంగా ఉంది. ఇక్కడ వారానికి 56 సగటును పని చేస్తారు. బంగ్లాదేశ్‌కు 50.4 గంటలు, పాకిస్తాన్‌కు 49.2 గంటలు, యుఎఇలో 48.7 గంటలు, వియత్నాంలో 45.3 గంటలు, టర్కీలో 44.9 గంటలు, హాంకాంగ్‌లో 44 గంటలు, ఫిలిప్పీన్స్‌లో 42.1 గంటలు, దక్షిణ కొరియాలో 40 గంటలు, యుఎస్‌లో 38 గంటలు, జపాన్‌లో 36.9 గంటలు , UKలో 35.1 గంటలు మాత్రమే పని చేస్తున్నట్టు ఐఎల్‌వో డేటా చెబుతుంది.
గతంలో చైనాలో 996 విధానంలో పని చేసే వాళ్లు. ఇప్పుడు అక్కడ కూడా దాన్ని మార్చేశారు. వారానికి 6 రోజులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేసే వాళ్లు. దీనిపై విమర్శలు రావడంతో మెళ్లిగా దీని నుంచి చైనా కూడా తప్పుకుంటోంది. చైనా, భారతదేశంలో ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఉద్యోగి ఉత్పాదకతపై ప్రభావం చూపదని సర్వేలు చెబుతున్నాయి. చైనాలో ఒక ఉద్యోగి ఒక గంట పని చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు 19.8 డాలర్లు అందించగా, భారతదేశంలో అది 10.7డాలర్లుగా ఉంది. కార్మిక ఉత్పాదకతలో భారతదేశం ప్రపంచంలోనే 133వ స్థానంలో ఉంది. ఉత్పాదకత ప్రపంచ సగటు గంటకు 23.1 డాలర్లు కంటే వెనుకే. చైనాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 2000 తర్వాతి రెండు దశాబ్దాల్లో చైనా కార్మిక ఉత్పాదకత 4.4 రెట్లు పెరిగింది. భారతదేశం 2.5 రెట్లు వృద్ధి సాధించింది.
ILO డేటా ప్రకారం, పని గంటలు పెంచడం కంటే నైపుణ్యాలు పెంచడంతో ఉత్పాదకత పెంచుకోవచ్చు. ఉద్యోగులపై పెట్టుబడి పెట్టాలని సూచిస్తోంది. ఈ ఉత్పాదకత ఉద్యోగులు చేసే పనిపై ఆధారపడి ఉంటుంది. పని గంటలపై కాదు. ఇలా గంటకు అత్యధిక కార్మిక ఉత్పాదకతలో లక్సెంబర్గ్ టాప్‌లో ఉంది. ఇక్కడ గంటకకు 166 డాలర్లు ఉత్పాదకత లభిస్తుంది. రెండో స్థానంలో ఐర్లాండ్ ఉంది.
వారానికి 90, 70 గంటలు పని చేయాలనే ఆలోచన అర్థం లేనిదిగా నిపుణులుచెబుతున్నారు. ఇది ఉత్పాదకతను పెంచడానికి బదులుగా తగ్గిస్తుందంటున్నారు. ఇలా పని చేస్తే తీవ్రమైన శారీరక, భావోద్వేగ ఒత్తిడి కలుగుతుంది. నిద్ర లేకపోవడం, అలసట, ఒత్తిడితో గుండె జబ్బులు, మధుమేహం, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. 2021లో WHO అధ్యయనం ప్రకారం వారానికి 55 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల హార్ట్ ఎటాక్ ముప్పు 35%, గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం 17% ఎక్కువగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మంచి శారీరక, మానసిక ఆరోగ్యానికి వారానికి 42-48 గంటలు పని చేయడం ఉత్తమం అంటున్నారు.
ఎక్కువ గంటలు పనిచేయడం అనేది ఉద్యోగి దృష్టి, సృజనాత్మకత, మొత్తం పనితీరుపై ప్రభావితం చూపిస్తుంది. పొడిగించిన పని గంటలు క్లిష్టమైన పరిశ్రమల్లోని ఉద్యోగులు మరిన్ని పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంది. నిర్ణయాధికారాన్ని బలహీనపరుస్తుంది. వారానికి 50 గంటలు పని చేస్తే ఉత్పాదకత తగ్గుతుంది. 55 గంటల తర్వాత వేగంగా మరింత వేగంగా పడిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. గరిష్ట ఉత్పాదకత సాధించాలంటే వారంలో 40 గంటల పని చేసే సంస్కృతి మంచిదని చెబుతున్నారు.