Bulgari: మార్క్‌ జుకర్‌బర్గ్‌ చేతికి క్రెడిట్‌ కార్డు లాంటి నాజూకైన వాచ్‌- ధర తెలిస్తే కళ్లు తేలేస్తారు!

Octo Finissimo Ultra SOSC

రెండు క్రెడిట్ కార్డులు ఒకదానిపై ఒకటి పెడితే ఎంత మందం కలిగి ఉంటాయో అంతే నాజూకుగా ఉండే సరికొత్త వాచ్ మార్కెట్‌లోకి వచ్చింది. దీన్ని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ధరించారు. దీంతో ఈ వాచ్‌ ఇప్పుడు హై ప్రొఫైల్‌ సొసైటీలో డిస్కషన్ పాయింట్ అయింది. లగ్జరీ ఉత్పత్తుల తయారు చేసే ఇటాలియన్ సంస్థ బల్గారీ దీన్ని తయారు చేసింది. దీని పేరు ఆక్టో ఫినిస్సిమో అల్ట్రా SOSC.

మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ చేతిలో ఈ వాచ్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. మరీ ఇంత నాజూగ్గా ఉన్న వాచ్‌ ఏ కంపెనీ తయారు చేసిందంటూ ఆరా తీస్తున్నారు. చివరకు దీన్ని ఇటాలియన్ కంపెనీ తయారు చేసినట్టు గుర్తించారు. ఈ ఆక్టో ఫినిస్సిమో అల్ట్రా SOSC కేవలం 1.7 మిమీ మందం మాత్రం కలిగి ఉంది. ఇందులో సమయం చాలా కచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజూ కేవలం 0.2 సెకన్లు మాత్రమే కోల్పోతుంది. మిగతా వాచ్‌ల కంటే చాలా తక్కువ. దీని ధర ఐదు కోట్లకుపైమాటే. అందులో ఈ టైపు వాచ్‌లను ఇరవై మాత్రమే ఉత్పత్తి చేశారు. దీని ప్రధాన ప్లేట్ టంగ్స్టన్ కార్బైడ్, టైటానియం బ్రాస్లెట్, లగ్స్ ఉపయోగించారు.

ఈ మధ్య మార్క్ జుకర్‌బర్గ్ డొనాల్డ్ ట్రంప్ నిధికి $1 మిలియన్ విరాళంగా అందించినట్లు వార్తలు వచ్చాయి. జనవరి 6, 2021 తర్వాత మెటా తన ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ట్రంప్‌ను నిషేధించిన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాళ్లిద్దరు సమావేశమయ్యారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో డొనాల్డ్ ట్రంప్, మార్క్ జుకర్‌బర్గ్‌ కలిసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జుకర్‌బర్గ్, ట్రంప్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఈ ఫండ్‌ను పంపించడం సంచలనంగా మారింది.