Sai kumar: చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ నటిస్తున్నవారు చాలా అరుదు. ఆ కొంత మంది వరుస సినిమాలు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అందులో సాయి కుమార్ ఒకరు. విలక్షణ నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, హీరోగా మంచి పేరు దక్కించుకున్న సాయికుమార్‌ను.. తాజాగా పూణెలోని ప్రముఖ ఆంధ్ర సంఘం ఘనంగా సత్కరించింది.
1941లో పూణెలో పెట్టిన ఈ ఆంధ్ర సంఘం ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతటి ప్రాచుర్యం పొందిన సంస్థ సాయి కుమార్‌ను ఉగాది పర్వదినం నాడు ఘనంగా సత్కరించింది. 50 ఏళ్లుగా కళామతల్లికి సేవలు అందిస్తున్న సాయి కుమార్, ఆయన భార్య సురేఖను సత్కరించారు. అంతే కాకుండా సాయి కుమార్‌కు అభినయ వాచస్పతి’ అనే అవార్డుతో సన్మానించారు. ఆంధ్ర సంఘం లాంటి సంస్థ తనను ఇలా సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని సాయి కుమార్ తెలిపారు.
కాగా సాయి కుమార్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. నటుడిగా కెరీర్ ప్రారంభించి యాభై ఏళ్లు గడిచినా వరుసగా సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులతో సాయి కుమార్ దూసుకుపోతున్నారు. ఇటీవల కమిటీ కుర్రోళ్లు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, కోర్ట్ వంటి పలు సూపర్ హిట్ మూవీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
సాయి కుమార్ ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటి గట్టు, అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ, నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తిక్ వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నారు. సత్య సన్నాఫ్ హరిశ్చంద్ర, చౌకిదార్ అని కన్నడలో, డీజిల్ అని తమిళంలో సినిమాలు చేస్తున్నారు. కన్యాశుల్కం, మయసభ అనే వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. ఇక సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ సైతం ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్, శంబాల అని పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.