Sandhya Theater Case: ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన దుర్ఘటనకు సంబంధించి టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో 35 ఏళ్ల మహిళ మృతి చెందగా, ఆమె 8 ఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పూర్తిగా కోలుకోడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలున్నట్లు తెలిసింది.
ఆ రోజు ఏం జరిగింది?
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 చిత్ర ప్రీమియర్ షోను హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ షోకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. షోకు సుమారు రెండు గంటల ముందే ఇక్కడికి పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడారు. అదే సమయంలో అల్లు అర్జున్ కూడా థియేటర్‌కు రావడం, సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తెరవడం.. ఒక్కసారే అభిమానులంతా తోసుకుని ముందుకు వచ్చారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. దీంతో రేవతి (35) అనే మహిళ, ఆమె 8 ఏళ్ల కొడుకు శ్రీతేజ్ కిందపడిపోయారు. జనాలంతా వాళ్లపై పడటంతో.. స్పృహ కోల్పోయారు. రేవతి అక్కడికక్కడే చనిపోయింది. శ్రీతేజ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు.
అల్లు అర్జున్ వల్లే?
వద్దని వారించినా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్‌కు వచ్చారని, అందువల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్, థియేటర్ యాజమాన్యంపై సెక్షన్ 304, 336, 337, 338 కింద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ A11గా చేర్చారు. విచారణలో భాగంగా అల్లు అర్జున్‌ను డిసెంబరు 13న అరెస్టు చేశారు. అదే రోజు సాయంత్రం అతనికి తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీంతో డిసెంబర్ 14న బన్నీ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ బెయిల్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ కోసం బన్నీ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది.
షరతులు ఇవే..
జనవరి 3న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అతనికి రూ. 50,000 చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అలాగే, అల్లు అర్జున్ తన రెసిడెన్షియల్ అడ్రస్ మార్చినప్పుడు కోర్టు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. అంతే కాకుండా, దేశం విడిచి వెళ్లాలనుకుంటే కోర్టు అనుమతి అవసరమని పేర్కొంది. అల్లు అర్జున్ తనపై జరుగుతున్న విచారణకు పూర్తి సహకారం అందించాలని, ఆదివారం పోలీసులు విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.