‘పుష్ప 2’ మూవీ అల్లు అర్జున్‌కు సంతోషం కంటే బాధనే ఎక్కువ మిగిల్చింది. ఈ మూవీ దేశవ్యాప్తంగా భారీగా వసూళ్లు చేస్తున్నా.. ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయలేని స్థితిలో అల్లు అర్జున్ ఉన్నాడు. ఇందుకు కారణం.. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట. ఆ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కొడుకు శ్రీతేజ తీవ్ర గాయాలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే, తలకు బలమైన గాయం కావడం వల్ల ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నాడు. దీంతో ప్రజల్లో కూడా అల్లు అర్జున్‌పై ఒకరకమైన వ్యతిరేకత ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం.. అల్లు అర్జున్ ఆటిట్యూడ్ అనే టాక్ నడుస్తోంది.
తొక్కిసలాట ఘటనలో A11గా ఉన్న అల్లు అర్జున్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అల్లు అర్జున్ నవ్వుకుంటూ పోలీసుల వ్యాన్ ఎక్కడం, అభిమానులకు అభివాదం చేయడం, బ్రాండెడ్ టీషర్ట్‌తో తన సినిమాకు ప్రచారం కల్పించుకోవడాన్ని జనాలు తప్పుబట్టారు. జైల్లో ఒకరాత్రంతా గడిపిన బన్నీ.. ఉదయాన్నే ఇంటికి రాగానే మీడియాను తన ఇంటికి పిలిపించుకున్నాడు. తన పరామర్శలను లైవ్‌లో చూపించాడు. అప్పుడు కూడా ఐకాన్ స్టార్ అనే టీ షర్ట్ ధరించాడు. ఇది కూడా జనాలకు నచ్చలేదు. ఒకపక్క ఆ బాలుడు ఆస్పత్రి బెడ్ మీద ప్రాణాల కోసం పోరాడుతుంటే.. ఇక్కడ పరామర్శలు ఏమిటీ? అల్లు అర్జున్ ఏమైనా ఘనకార్యం చేసి జైలుకు వెళ్లి వచ్చాడనా అలా పరామర్శలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అంతా ఏకిపారేశారు.
ఆ ప్రభావమో ఏమిటో గానీ.. అల్లు అర్జున్‌లో మంగళవారం చాలా మార్పు కనిపించింది. సంధ్య థియేటర్ ఘటనపై విచారణ కోసం పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన స్వయంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అభిమానులకు ఎలాంటి అభివాదం చెయ్యకుండా సింపుల్‌గా కారెక్కేశాడు. బ్రాండెడ్ షర్ట్స్‌కు బదులు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు. స్టేషన్‌కు వెళ్లిన తర్వాత కూడా చాలా మౌనంగా.. మీడియా ప్రతినిధులను కూడా చూడకుండా సింపుల్‌గా కనిపించాడు.
పోలీసుల విచారణలో అల్లు అర్జున్ తనకు ఆ ఘటన గురించి ఎంత వరకు తెలుసో అంతే చెప్పాడని తెలిసింది. కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోయాడని సమాచారం. అయితే, బన్నీ కొన్ని ప్రశ్నలకు బదులిస్తూ.. ఈ ఘటనలో తనది కూడా ఎంతోకొంత తప్పు ఉందనే విషయాన్ని అంగీకరించాడని తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరిగిందనేది తనకు పూర్తిగా తెలియలేదని, షాక్‌లో ఉన్నానని బన్నీ చెప్పడంతో పోలీసులు ఆ రోజు థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటల ఘటన సీసీటీవీ వీడియోలను చూపించారట.
అందులో రేవతి, ఆమె కొడుకును బతికించడానికి సీపీఆర్ చెయ్యడం, హాస్పిటల్‌కు తీసుకెళ్లడం వంటి వీడియోలను చూసి బన్నీ చలించిపోయాడట. వాళ్లను అలా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఆ తర్వాత బన్నీ.. ఈ కేసు విచారణ ముందుకు సాగేందుకు తప్పకుండా సహకరిస్తానని చెప్పాడట. దీంతో పోలీసులు విచారణ ముగించి బన్నీని తిరిగి ఇంటికి పంపేశారు. సుమారు 3 గంటలకు పైగా ఈ విచారణ సాగినట్లు తెలిసింది. బన్నీ ఈసారి చాలా హుందాగా వ్యవహరిచారని జనాలు అంటున్నారు. తనలో చాలా మార్పు కనిపించిందని అంటున్నారు. మరోవైపు రేవతి భర్త కూడా కేసును వెనక్కి తీసుకుంటానని చెప్పడంతో త్వరలోనే బన్నీకి ఉపసమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.